వినటానికే విచిత్రంగా ఉంది కదా. అయినా నిజంగా జరిగిందదే. ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో బిజెపి ప్రజాప్రతినిధులు, నేతల కీలక సమావేశం జరిగింది. సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి.  టిడిపి-బిజెపి మధ్య సంబంధాలపైన, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రం మొదలుపెట్టిన ప్రచారం తదితర అంశాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చర్చ జరిగింది.

చర్చలో ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిపై మాట్లాడుకుంటూనే ఇంకోవైపు జగన్ పాదయాత్ర, జనాల్లో పెరుగుతున్న ఆదరణపైన కూడా నేతలు చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసిన నేతలు కొద్దిసేపు జగన్ పాదయాత్రపైన కూడా మాట్లాడుకున్నారు.

రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర ఎలా సాగింది? కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాల కనబడిన జనాధరణ, రాజధాని గుంటూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించటంపైన కూడా మాట్లాడుకున్నారట. రోజురోజుకు జగన్ కు ప్రజాధరణ పెరుగుతోందని సమావేశం అభిప్రాయపడిందట. జగన్ కు ప్రజాధరణ పెరిగితే మొదటి నష్టపోయేది చంద్రబాబే అని నేతలు నిర్ణయానికి వచ్చారట. ఒకవైపు మిత్రపక్షమైన చంద్రబాబును తక్కువ చేసి మాట్లాడుతూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవటమంటే దేనికి నిదర్శనమో?