వారం రోజులుగా మంత్రి కనబడటం లేదు

First Published 10, Apr 2018, 11:48 AM IST
internal war between akhila and av reached to its peak
Highlights
మంత్రి, ఎంఎల్ఏకి సంబంధించిన వార్తలను సుమారు వారం రోజులుగా లోకల్ ఛానల్ లో ఎక్కడా కనబడకుండా చేసేశారు.

వారం రోజులుగా మంత్రి అఖిలప్రియకు సంబంధించిన వార్తలేవీ నంద్యాల లోకల్ చానల్లో కనబడటం లేదు. పార్టీ అంతర్గత విభేదాలు ముదిరిపోవటమే అందుకు కారణం. 

నంద్యాలలో మంత్రి అఖిలప్రియ, సోదరుడు, ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డికి టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. మంత్రి, ఎంఎల్ఏకి సంబంధించిన వార్తలను సుమారు వారం రోజులుగా లోకల్ ఛానల్ లో ఎక్కడా కనబడకుండా చేసేశారు.

అసలే ఉప్పు-నిప్పు లాగున్న భూమా-ఏవి వర్గాలు తాజా వివాదంతో ఒకరిపై మరొకరు రగిలిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియ స్ధానంలో తనకే టిక్కుట్టు కావలని టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే ఆళ్ళగడ్డ, నంద్యాలలో బాగా పట్టున్న ఏవి ఆళ్ళగడ్డపై పూర్తిగా దృష్టి పెట్టారు. దాంతో మంత్రి అఖిలప్రియకు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయ్.

ఎందుకంటే, తన వర్గంలోనుండి ఏవి వర్గంలోకి నేతలు ఒక్కరొకరుగా వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో టిడిపిలోని నేతలు కూడా అఖిలను పట్టించుకోవటం లేదు.

దాంతో పార్టీలో మంత్రి దాదాపు ఒంటైపోయారు. దాన్ని ఏవి తనకు అవకాశంగా మలచుకుంటూ మానసికంగా మంత్రిని దెబ్బ కొడుతున్నారు. అందులో భాగంగానే వారం నుండి భూమా కుటుంబానికి సంబంధించిన వార్తలేవీ స్ధానిక లోకల్ చానల్లో కనిపించటం లేదు.

విషయం తన దృష్టికి రాగానే మంత్రి చానల్ మేనేజర్ ను నిలదీసారట. అయితే, విషయం ఏమైనా ఉంటే ఏవి సుబ్బారెడ్డినే అడగాలంటూ సమాధానం చెప్పారట.

దాంతో మంత్రికి ఒళ్ళుమండిపోయింది.  ఎంఎల్ఏ వార్తలను  ప్రసారం చేస్తూ మంత్రి వార్తలు మాత్రమే నిలిపారట. ఆ విషయమై ఎంఎల్ఏ అభ్యంతరం చెప్పటంతో ఎంఎల్ఏ వార్తలను కూడా నిలిపేశారు.

లోకల్ చానల్లో మెజారిటీ వాటా ఏవి చేతిలోనే ఉందని సమాచారం. దాంతో ఏవి ఆడిందే ఆట పాడిందే పాట. తాజా వివాదంతో మంత్రి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

loader