కృష్ణా జిల్లా గన్నవరంలో వంశీ, దుట్టా వర్గాల మధ్య వైరం తారాస్థాయికి చేరుతున్నది. గన్నవరం బాధ్యతల నుంచి వల్లభనేని వంశీని తొలగించాలని, ఆయన తప్పా ఇంకెవరికైనా ఆ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వల్లభనేని తప్పా ఎవరిని పార్టీ ఇన్‌చార్జీగా నియమించినా 30 వేల ఓట్లతో గెలిపించుకుంటామని పేర్కొనడంతో గన్నవరంలో వంశీకి నిరసన సెగ తీవ్రస్థాయికి చేరింది. 

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీ నుంచే నిరసన సెగ వేడెక్కింది. ఈ సారి అల్టిమేటం విధించి మరీ ఈ ప్రత్యర్థులు పోరును తారాస్థాయికి తీసుకెళ్లారు. గన్నవరం వైసీపీ ఇన్‌చార్జీగా వల్లభనేని వంశీ తప్పించాలని, పార్టీ బాధ్యతలను వేరేవారినికి అప్పగించాలని కోరుతూ సోషల్ మీడియాలో జగనన్న అభిమానులు, వైకాపా కార్యకర్తల పేరిట ఓ లేఖ రచ్చ చేస్తున్నది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ రాసిన ఈ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జీగా వల్లభనేనిని నియమించవద్దని, ఆయన తప్పా మరెవరికీ కేటాయించినా.. ఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని ఉన్నది.

వల్లభనేని వంశీపై ఆరోపణలు
తాము తొమ్మిదేళ్లపాటు కోట్ట రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామని ఆ లేఖలో వల్లభనేని ప్రత్యర్థులు పేర్కొన్నారు. వంశీ కేవలం తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే వైసీపీలోకి వచ్చాడని ఆరోపించారు. తెదేపా నుంచి గెలిచిన వంశీ వైకాపాకు మద్దతు ప్రకటించడానికి ఇదే ప్రధాన కారణం అని తెలిపారు. అలా అయినా.. అందరినీ కలుపుకుపోతానని పేర్కొంటూ వైసీపీలోకి వచ్చిన వంశీ వాస్తవంలో పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. కొందరు మంత్రుల సహాయంతో ఈ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఇప్పటికీ అక్రమ కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరించారు. గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను వల్లభనేని వంశీకి తప్పా ఇంకెవరికి కేటాయించినా తమకు సమ్మతమేనని, వారిని 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో వైసీపీని కాపాడుకోవడానికి వెంటనే కొత్త ఇన్‌చార్జీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ లేఖ రాసింది దుట్టా వర్గమేనని చెబుతున్నారు.

ఇప్పుడే ఎందుకు లేఖ?
వల్లభనేని కొన్నాళ్లుగా పార్టీకి మరింత దగ్గర కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ కార్యక్రమాలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రణాళికల్లో ఉన్నట్టు తెలిసింది. సీఎం జగన్‌కు మరింత సన్నిహితం కావాలని పార్టీ కార్యకలాపాలను వంశీ వేగవంతంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే వల్లభనేనిని ఏకాకి చేయాలని ప్రత్యర్థి వర్గం ఆలోచిస్తున్నట్టు అర్థం అవుతున్నది. శాసనసభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో వంశీ అటువైపుగా దృష్టి సారిస్తున్నారు. ఈ తరుణంలో దుట్టా వర్గం.. వంశీకి సహకరించకుండా నిస్సహాయుడిని చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ తరుణంలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్టుగానే చెబుతున్నారు.

గన్నవరంలో వర్గపోరు ఎలా మొదలైంది?
2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ, అప్పటికే గన్నవరంలో వైసీపీ తరఫున నాయకత్వ స్థానంలో ఉన్నవారితో ఆయనకు పొసగలేదు. గన్నవరానికే చెందిన దుట్టా రామచంద్రరావు వర్గానికి వల్లభనేని వంశీకి మధ్య అంతర్గతంగా పోరు మొదలైంది. తొలుత దుట్టా, యార్లగడ్డ వర్గానికి, వంశీ వర్గానికి వైరం ఉండేది. కానీ, యార్లగడ్డ క్రమంగా కనుమరుగైనా.. దుట్టా వర్గం మాత్రం వంశీతో బలంగా పోరు చేస్తున్నది. ఈ పోరుగా ఎంత తీవ్రతతో ఉన్నదంటే.. గన్నవరం నియోజకవర్గంలోని మండలాలు వంశీ, దుట్టా వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి.