‘దేశం’లో ఆధిపత్య పోరు

internal bickering in TDP on the rise
Highlights

తమ మధ్య వివాదాలను చంద్రబాబు పరిష్కరించలేరన్న విషయం తమ్ముళ్ళకు బాగా అర్ధమైపోయింది. అందుకనే వివాదాలు చిలికి చిలికి వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీపై చంద్రబాబునాయడు పట్టు కోల్పోతున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రజీ జిల్లాలోనూ అంతర్గత విభేదాలు రోడ్డున పడుతున్నాయి. అయినా చంద్రబాబు వాటిని ఆపలేకున్నారు.

 

నాయకులను పిలిచి మాట్లాడి సర్దుబాటు చేద్దామనుకున్నా కుదరటం లేదు.వివాదాలు చిలికి చిలికి వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

పైగా అధినేత ముందే ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దాంతో వారిని ఎలా అదుపుచేయాలో తెలీక తన సహజ ధోరణిలో వివాదాల పరిష్కారాన్ని చంద్రబాబు నాన్చుతున్నారు.

 

దాంతో తమ మధ్య వివాదాలను చంద్రబాబు పరిష్కరించలేరన్న విషయం తమ్ముళ్ళకు బాగా అర్ధమైపోయింది. అందుకనే తమ మధ్య పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరినా ఎవరు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు.

 

మొత్తం 13 జిల్లాల్లోనూ వివాదాలు పెరుగుతుండటం గమనార్హం. వివాదాలు రెండురకాలుగా ఉన్నాయి. ఒకటి తమ్ముళ్ల మధ్యే తగాదాలు. రెండోది పాత తమ్ముళ్లకు, కొత్త తమ్ముళ్ళకు మధ్య ఆధిపత్య పోరాటాలు. ప్రస్తుతం రెండు కూడా పార్టీలో బాగా పెరిగిపోతున్నాయి.

 

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయడుపై జిల్లాలోని ఎంఎల్ఏల్లో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. విజయనగరం జిల్లాలో మంత్రి మృణాళినికి వ్యతిరేకంగా పలువురు ఎంఎల్ఏలు, జడ్ ఫి ఛైర్మన్, ఎంఎల్సిలు జట్టుకట్టారు.

 

ఇక విశాఖపట్నం సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇద్దరు మంత్రలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ రావుల మధ్య ఏమాత్రం పొసగదు. వీరి మధ్య ఎంఎల్ఏలు, ఎంపి, ఎంఎల్సిలు చీలిపోయారు.

 

ఇక, రాయలసీమ జిల్లాల్లో అయితే మరింత ఘోరం. కర్నూలులో మంత్రి కెఇ కృష్ణమూర్తి వర్గానికి ఇతర ఎంఎల్ఏలకు ఏమాత్రం పడదు. దానికితోడు వైసీపీ నుండి వచ్చిన భూమానాగిరెడ్డి వర్గానికి జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి వర్గానికి ఉప్పు-నిప్పు. దాంతో గ్రూపుల మధ్య ఎప్పుడూ గొడవలే.

 

అనంతపురంలో కూడా పార్టీలోని మంత్రులకు, శాసనసభ్యులకు పడదు. మంత్రి పరిటాల సునీత జిల్లా మొత్తం శాసించాలని చూస్తోందంటూ ఆరోపణలున్నాయి. ఎంపి జెసి దివాకర్ రెడ్డి వర్గానికి, ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి వర్గానికి ఎప్పుడు చుక్కెదురే. కడప జిల్లాలో ఉన్నది ఒకే ఎంఎల్ఏ అయినా ఇతరులతో పడదు.

 

దానికి తోడు వైసీపీ నుండి చేరిన బద్వేల్ ఎంఎల్ఏ జయరాములుకు జిల్లా అధ్యక్షునితో పడదు. ఇక ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య వివాదాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. శాసనమండలి డప్యుటి ఛైర్మన్ సతీష్ రెడ్డిది మరో వర్గం. దాంతో నేతల మధ్య గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి.

 

చిత్తూరులో కూడా గ్రూపు తగదాలు పెరిగిపోతున్నాయి. సొంత జిల్లా అయినప్పటికీ ఎవరినీ అదుపులో పెట్టే పరిస్ధితిలేదు. ఇక, కోస్తా జిల్లాలైన ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా పరిస్ధితి శృతిమంచుతోంది. ఎప్పుడూ ఆధిపత్య గొడవలే. దాంతో పార్టీలో మూడు గ్రూపులు ఆరు చీలకలుగా తయారైంది.

 

        

loader