విజయవాడ: కరోనా విజృంభణ కారణంగా నెలల తరబడి స్కూల్స్, కాలేజీలకు దూరమైన విద్యార్థులకోసం ప్రస్తుతం విద్యాసంస్థలన్నీ ఆన్ లైన్  క్లాసులు నిర్వహిస్తోంది. కరోనా నిబంధనలను లోబడి ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకు ఆన్ లైన్ క్లాసులను నిర్వహించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఇలా ఓ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులు అర్థం కాక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసముంటున్న నడకుదిటి సత్యన్నారాయణ కుమారుడు దినేష్ (18) గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొద్దిరోజులుగా అతడు ఆన్ లైన్ లో కాలేజీ లెక్చరర్ల క్లాసులు వింటున్నాడు. అయితే ఆ క్లాసులు అర్థంకాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో తోటి స్నేహితుల ముందు పరువు పోతోందని ఆత్మనూన్యతకు లోనయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగిన దినేష్ ను అతడి కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. దీంతో విద్యార్థి తండ్రి తన కొడుకు ఆత్మహత్యకు కాలేజీ నిర్వహించిన ఆన్ లైన్ క్లాసులే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.