తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ కాలేజ్ పరీక్ష కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ కాలేజ్ పరీక్ష కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సైదాపురానికి చెందిన సతీష్‌గా (18) గుర్తించారు. అతడు ఇంటర్ సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. మంగళవారం పరీక్ష రాసేందుకు గుడూరులోని డీఆర్‌డబ్ల్యూ కాలేజ్ పరీక్ష కేంద్రానికి వచ్చిన సతీష్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఇది గమనించిన అక్కడివారు సతీష్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే సతీష్ మృతిచెందాడు. సతీష్ మృతి చెందినట్టు అతని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. మరోవైపు, ఈ ఘటనతో పరీక్ష కేంద్రం వద్ద విషాదం నెలకొంది.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9లక్షల 14వేల 423 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87, 435 మంది రాయనున్నారు. ఈ పరీక్షలకు గాను అధికారులు 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.
