నెల్లూరు: తాను ప్రేమించిన యువకుడి తల్లి వార్నింగ్ ఇవ్వడంతో ఓ యువతి నిండు ప్రాణాలను బలితీసుకుంది. నా కొడుకునే ప్రేమిస్తావా అంటూ ప్రేమికుడి తల్లి నానా మాటలు అనడంతో తట్టుకోలేని ఆ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వడ్డెరపాళెంకు చెందిన వల్లెపు మస్తాన్‌ తన కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. కుమార్తె 16ఏళ్ల వల్లెపు మమత ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి రేణుకమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో మమతను అమ్మమ్మ చేరదీసింది. 10వ తరగతి వరకు అమ్మవద్ద చదువుకున్న మమతను తండ్రి మస్తాన్ ఆత్మకూరులోని ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు.

ఆత్మకూరు దగ్గరలోని బాలికల హాస్టల్‌లో ఉంటూ మమత చదువుకుంటోంది. అనారగ్యంతో రెండురోజుల క్రితం మమత ఇంటికి వచ్చింది. మమత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన అంకమ్మ అనే మహిళ తన కుమారుడిని ప్రేమిస్తోందంటూ తిట్టింది. అందరూ చూస్తుండగానే తిట్టడంతో తట్టుకోలేక మనస్థాపంతో మమత బాత్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పొలం నుంచి ఇంటికి వచ్చిన  మస్తాన్‌ కు కూతురు కనిపించకపోవడంతో బాత్‌రూంలో చూడగా ఉరేసుకుని కనిపించింది. మమతను కిందకి దించి దగ్గరలోని ఆర్ఎంపీ డాక్టర్ కు చూపించగా అపపటికే మృతి చెందిందని చెప్పారు.

తన కుమార్తె మృతికి కారణం తెలుసుకున్న మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.