జట్టు బాగా ఒత్తుగా పెరగాలని మందులు వాడింది. ఆ మందులకు జట్టు పెరగడం పక్కన పెడితే... అవి వికటించి ఆ అమ్మాయి ప్రాణాలే పోయాయి ఏకంగా. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణంలోని హరిజనవాడకు చెందిన కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మ కుమార్తె మౌనిక(19) స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సవరం చదువుతోంది. తల జుట్టు రాలుతుండటంతో పాటు, వెంట్రుకలు ఒత్తుగా రావడానికి శివ సర్కిల్‌లోని పల్లవి పాలీ క్లినిక్‌ మెడికల్‌షాప్‌కు కర్నూల్‌ నుంచి వస్తున్న డాక్టర్‌ శరత్‌చంద్ర వద్ద 2 నెలల క్రితం చూపించుకుంది. డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడటంతో శరీరంపై బొబ్బలు వచ్చాయి. ఇదే విషయాన్ని మెడికల్‌ షాప్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే వాళ్లు పట్టించుకోకపోగా... తగ్గిపోతుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మందులు ఇచ్చిన డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీంతో.. విద్యార్థి ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సోమవారం మెడికల్‌ షాప్‌ దగ్గకు చేరుకొని ఆందోళనకు దిగారు. మెడికల్‌ షాప్‌కు తాళం వేసి, పోలీసుకుల సమాచారం ఇచ్చారు. డాక్టర్‌పైనా, మెడికల్‌ షాపు నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని మృతురాలు కుటుంబ సభ్యులు కోరారు.