కడప: ప్రపంచం అంతా అమ్మను ఒక దేవతలా కొలుస్తారు. నవమాసాలు మోసి ఆ తర్వాత కనిపెంచిన తల్లిని దేవుడికి ప్రతిరూపంగా కొలుస్తారు. ఏ బిడ్డ అయినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కన్నతల్లికే మెుదట చెప్పి అమ్మ ఆశీస్సులు పొందుతారు. 

అంతటి విశిష్టత కలిగిన అమ్మ ప్రేమకు కలంకం తీసుకువచ్చింది ఓ తల్లి. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి ముక్కుపచ్చలారని పసికందును కడతేర్చింది. తన ఒడిలో పెట్టుకుని ముద్దాడాల్సిన తల్లి నిర్థాక్షిణ్యంగా బిడ్డపై మమకారం లేకుండా కాలువలో పడేసి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన లింగాల నాగేంద్రయాదవ్‌, సుభాషిణి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి రెండేళ్లు కాగా చిన్నమ్మాయి నాలుగు నెలల పసికందు.

అయితే నాలుగునెలల పసిగుడ్డు అయిన చిన్నకుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి జమ్మలమడుగు వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండున్నర గంటల మధ్య జమ్మలమడుగులోని సంజాముల మోటు వద్ద అటూ ఇటూ తిరిగింది. 

అనంతరం గొల్లపల్లె కాలువలో జ్యోత్స్నను పడేసింది. ఆ తర్వాత తన కుమార్తె కనిపించడం లేదంటూ జమ్మలమడుగు అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు కనిపించలేదంటూ ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో సంజాముల మోటు వద్దకు వెళ్లి విచారించారు. అయితే సుభాషిణి ఓ ప్రైవేటు బస్సులో ఆమె జమ్మలమడుగులో దిగి ఒక వృద్ధ మహిళకు చిన్న బాలికను ఇచ్చి ఆమె ఏదో చేసినట్లు పోలీసుల వివరణలో తేలింది. 

తల్లి సుభాషిణి ప్రవర్తనపై అనుమానం రావడంతో డీఎస్పీ నాగరాజు, సీఐలు మంజునాథరెడ్డి, మధుసూదన్‌రావు, ఎస్‌ఐలు రంగారావు, ధనుంజయుడు, ప్రవీణ్‌కుమార్‌ తనదైన శైలిలో విచారించారు. 

సుభాషిణిని గొల్లపల్లె గ్రామంలోని కాలువ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కాలువలో పసికందు శవమై కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తలమంచిపట్నం పోలీసుస్టేషన్‌లో భర్త నాగేంద్రయాదవ్‌తో పాటు ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లి సుభాషిణి నాలుగు నెలల పసికందును కాలువలో పడేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇకపోతే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. 

నాలుగు నెలల జ్యోత్స్నను చూసి ప్రతీ ఒక్కరూ కంటతడిపెట్టారు. పసిగుడ్డును చంపిన తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పసికందును ఆ తల్లి ఎలా చంపగలిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.