ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు మహిళలు ఒకరు నర్సుగా, ఇంకొకరు ఆయాగా నటించి పసి కందును ఎత్తుకెళ్లారు. కిడ్నాప్‌నకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్‌లో ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు గాలింపులతో ఆ శిశువుల శ్రీకాకుళంలో లభ్యమైంది.
అమరావతి: విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో కలకలం రేగింది. ఐదు రోజుల పసికందును కొందరు గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. ఇద్దరు మహిళలు ఒకరు నర్సుగా.. ఇంకొకరు ఆయాగా నటించి పసికందును ఎత్తుకెళ్లారు. కిడ్నాప్‌నకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. శిశువును ఎత్తుకెళ్లిన ఆ ఇద్దరు మహిళ కోసం పోలీసులు గాలింపులకు దిగారు. ఇదిలా ఉండగా, కనిపించకుండా పోయిన శిశువు తల్లిదండ్రులు, వారి బంధువులు హాస్పిటల్‌లో ఆందోళనలు చేస్తున్నారు. పోలీసుల గాలింపులో సదరు శిశువు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలిలో కనుగొన్నారు. కోట బొమ్మాలి నుంచి శ్రీకాకుళం ఎస్పీ ఆఫీసుకు శిశువును తీసుకెళ్తామని, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ పసికందును విశాఖకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో గైనిక్ వార్డులో నుంచి పసికందును ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిశువుకు పలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇద్దరు మహిళలు కలిసి ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. ఒక రకంగా బలవంతంగానే పసికందును ఎత్తుకెళ్లారని బంధువులు చెప్పారు. కాగా, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ మహిళలు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? వంటి విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, శిశువు తండ్రి మాట్లాడుతూ, నిన్న రాత్రి ఒక మహిళ తమ వద్దకు వచ్చి శిశువును పరీక్షించడానికి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పారని వివరించారు. ఆమె వెంటే తన బావమర్ది వెళ్లాడని తెలిపారు. పైనకు వెళ్లి డాక్టర్ లేడని మళ్లీ శిశువును కిందకు తెచ్చిందని తెలిపారు. కాగా, మరికాసేపటికి మళ్లీ వచ్చి శిశువును మళ్లీ పైనకు తీసుకెళ్లిందని వివరించారు. మళ్లీ ఆమె వెంటే తన బావమర్ది వెళ్లాడని తెలిపారు. కానీ, తీరా వార్డు దగ్గరకు చేరిన తర్వాత పురుషులు ఆ వార్డులోకి రావొద్దని ఆమె వారించారని వివరించారు. అలాగైతే.. తన తల్లిని పంపిస్తానని చెప్పి తన బావమర్ది కిందకు వచ్చాడని తెలిపారు. తన తల్లిని ఆమె దగ్గరకు వెళ్లమని చెప్పాడని, ఆమె మెట్ల గుండా పైనకు వెళ్లే సరికి ఆ మహిళ కనిపించలేదని వివరించారు.
అయితే, శిశువును ఎత్తుకెళ్లిన ఇద్దరు మహిళలు 24 గంటలుగా ఇదే హాస్పిటల్‌లో కనిపించారని, ఈ హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు కూడా వారిని పట్టించుకోకుండా వదిలేయడం ఏంటని బంధువులు నిలదీస్తున్నారు. హాస్పిటల్ సిబ్బందే గుర్తించకుంటే.. సాధారణ పేషెంట్లకు ఎలా తెలుస్తుందని అన్నారు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌లో (Niloufer Hospital) ఇదే నెలలో కిడ్నాప్ కలకలం రేపింది. 18 నెలల చిన్నారిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. చిన్నారి కిడ్నాప్‌కు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించి.. పాపను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.
