సామాన్యులు కావచ్చు, దేశ ప్రధమ పౌరుడు కావచ్చు రాష్ట్రప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం.

సామాన్యులు కావచ్చు, దేశ ప్రధమ పౌరుడు కావచ్చు రాష్ట్రప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం. ప్రమాదాల నుండి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు మాత్రం కనబడటం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, రాష్ట్రపతితో పాటు కుటుంబ సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కుటుంబసభ్యులు కృష్ణా నదిలో పర్యటించాలని అనుకున్నారు. ఇంకేముంది రాష్ట్రప్రభుత్వం వెంటనే ఒ బోటును సిద్ధం చేసేసింది. రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ దగ్గరుండి మరీ రాష్ట్రపతి సతీమణి, కుమార్తెలను విజయవాడలోని పున్నమీఘాట్ నుండి భవానీ ద్వీపం వరకూ బోటు షికారుకు తీసుకెళ్ళారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ. అసలు సమస్య అంతా అక్కడే మొదలైంది. పోయిన నెలలో పున్నమీఘాట్ వద్దకు వెళ్ళిన సమయంలోనే బోటు తిరగబడి 23 మంది మరణించిన సంగతి అందరికీ గుర్తుంది కదా? అప్పట్లో అనుమతి లేని బోటును నదిలో తిప్పటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి రాష్ట్రప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఆ బోటును అధికారులు సీజ్ చేసేసారు. అయితే, ఇపుడు రాష్ట్రపతి కుటుంబ సభ్యుల షికారుకు ప్రభుత్వం ఉపయోగించిన బోటు అప్పుడు సీజ్ చేసినదే అట.

రాష్ట్రపతి కుటుంబ సభ్యులషికారు మొదలైన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ విషయం ఆనోటా ఈనోటా రాష్ట్రపతి సెక్యురీటి అధికారుల చెవిన పడింది. వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని నిర్ధారించుకుని అదే విషయాన్ని రాష్ట్రపతి భవన్ కు చేరవేసారు. ఇంకేముంది, రాష్ట్రపతి భవన్ వెంటనే రంగంలోకి దిగింది. కేంద్రప్రభుత్వానికి విషయం చేరవేసి వెంటనే ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రపతి భవన్ నుండి వచ్చిన ఆదేశాలను చూసి కేంద్రప్రభుత్వం బిత్తరపోయింది. వెంటనే రాష్ట్రప్రభుత్వానికి తాఖీదును పంపింది. ఈ విషయమై వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది.

కేంద్రం నుండి వచ్చిన నోటీసును చూడగానే రాష్ట్రప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ఇటు రాష్ట్రపతి కుటుంబానికి అటు కేంద్రానికి ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచటం లేదు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు చెప్పుకుంటోంది. ఇక్కడే, రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడింది. సీజ్ చేసిన బోటును రాష్ట్రపతి కుటుంబానికి ఉపయోగించటమేంటో ఎవరికీ అర్దం కావటం లేదు. రాష్ట్రపతి కుటుంబానికే సీజ్ చేసిన బోటును ఉపయోగించారంటే, సామాన్యుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రపతి కుంటుంబం విజయవాడ వస్తోందంటే అన్నీ అనుమతులతో కూడిన ఓ బోటును సిద్ధంగా ఉంచుకోవాలన్న కనీస జ్ఞానం కూడా రాష్ట్రప్రభుత్వంలో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది.