అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటీ హోరాహోరీ ఉంటుందని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా దెబ్బ తింటుందని ఎవరూ ఊహించలేదు. కేవలం శాసనసభలో 23 సీట్లకు, లోకసభలో 3 సీట్లకు అది కుదించుకుపోయింది. 

రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బిజెపిలకు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. లోకసభ, శాసనసభ ఎన్నికలు, రెంటిలోనూ ఆ పార్టీల పరిస్థితి అదే. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి. బిజెపికి కేవలం 0.96 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెసుకు మాత్రం 1.29 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో నోటాకు 1.28 శాతం ఓట్లు పడగా, బిజెపికి 0.84 శాతం, కాంగ్రెసుకు 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి బిజెపి కన్నా కాంగ్రెసు నయంగా ఉంది. ఇరు పార్టీల అభ్యర్థులు కూడా లోకసభ, శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. ఆ అభ్యర్థుల్లో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఉన్నారు. నర్సారావు పేట లోకసభ స్థానం నుంచి పోటీ చేసిన కన్నా లక్ష్మినారాయణ మూడో స్థానంలో నిలిచారు. కల్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘువీరా రెడ్డి కూడా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు 2.8 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది.