చిత్తూరు: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరం దళితవాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గోపి అనే వ్యక్తి తన భార్య పరిమళతో కలిసి అంగరలో నివశిస్తున్నాడు. 

అదే గ్రామానికి చెందిన వేలాయుధం అనే వ్యక్తితో పరిమళకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై పరిమళ, గోపీల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. పరిమళ, వేలాయుధం కలుసుకోవడానికి గోపి అడ్డుతగులుతుండటంతో ఆయన్ను అడ్డుతొలగించాలని ప్లాన్ వేశారు. 

కూల్ డ్రింకల్ లో పురుగుల మందు కలిపి దాన్ని గోపీకి ఇవ్వమంటూ వేలాయుధం అతడి చిన్నాన్న కుమారుడైన మేఘవర్ణానికి ఇచ్చి పంపించాడు. కూల్ డ్రింక్ ను తీసుకెళ్లిన మేఘవర్ణం గోపికి ఇచ్చాడు. సగం తాగిన గోపి మిగిలిన కూల్ డ్రింక్ ను మేఘవర్ణంకు ఇచ్చేశాడు. 

దీంతో మేఘవర్ణం ఆ డ్రింక్ ను ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. పురుగులుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లాడు మేఘవర్ణం. ఆ సమయంలో మేఘవర్ణం భార్యకు తీవ్ర కడుపునొప్పిరావడంతో ఉపశమనం కోసం ఆ  కూల్ డ్రింక్ ను తాగేసింది. 

అనంతరం నోటి నుంచి నురగలు రావడంతో గమనించిన స్థానికులు తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. మరోవైపు గోపి కూడా పురుగులుమందు కలిసిపిన కూల్ డ్రింక్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోవడంతో అంగర గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.