వివాహేతర సంబంధం.. మరొకరి ప్రాణాలను బలిగొంది. అక్రమ సంబంధం వద్దని వారించినందుకు రక్తం పంచుకు పుట్టిన అన్ననే హత్య చేసింది ఓ చెల్లెలు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లక్కవరం గ్రామానికి చెందిన నన్నం కోటయ్య, మహాలక్ష్మమ్మకు నన్నం వెంకటేశ్వర్లు (32), తిరుపతమ్మ సంతానం కలిగారు. ఇరువురికి తల్లిదండ్రులు వివాహం చేశారు. నన్నం వెంకటేశ్వర్లు ఆరోగ్య సమస్యతో ఉండగా భార్య అతనిని విడచి వెళ్లిపోయింది. తిరుపతమ్మ కూడా భర్తతో విడిపోయి ఇంటివద్దనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తిరుపతమ్మ అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న అన్న వెంకటేశ్వర్లు ఇది మంచి పద్ధతి కాదని వారించాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు తన పొలం వద్దె ఉన్న నీటి కుంటలో శవమై తేలాడు. విషయం తెలిసిన బంధువులు శవాన్ని గురువారం రాత్రి నివాసానికి తీసుకువచ్చారు. అయితే పొరపాటున పడి మరణించి ఉంటారని తిరుపతమ్మ గ్రామస్తులతో నమ్మబలికింది.

 కానీ పొలంలో ప్రియునితో కలిసి అన్నను హత్యచేసి నీటి కుంటలో వేసి ఉంటారని గ్రామస్తులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ రంగనాథ్‌ శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దర్శి ఇన్‌చార్జి సీఐ హైమారావు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని దర్శి వైద్యశాలకు తరలించారు.  హత్య, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎస్‌ఐ రంగనాథ్‌ కేసు నమోదు చేశారు.