అమరావతి: అవినీతి నిర్మూలన కోసం అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందంతో పేదలకు లబ్ది జరగనుందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

అవినీతి రహిత పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తున్న వైయస్‌.జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, అవినీతి నిర్మూలన దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించడానికి అధ్యయనం, తీసుకోవాల్సిన సిఫార్సులపై సూచనలకోసం దేశంలోనే ప్రముఖ మేనేజ్‌ మెంట్‌ సంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అహ్మదాబాద్‌ (ఐఐఎం–ఎ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

వచ్చే ఫిబ్రవరి మూడోవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంస్థ తన నివేదికను అందిస్తుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రజావిధానాల బృందం (పబ్లిక్‌ సిస్టమ్స్‌ గ్రూపు) ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ విశ్వజిత్‌ సంతకాలు చేశారు. 

అహ్మదాబాద్‌ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా పేదలకు, సామాన్యులకు లబ్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు.

 ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు వివక్షకు, అవినీతికి తావులేకుండా  పారదర్శక విధానంలో అందరికీ అందుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.పరిపాలనలో పారదర్శకత, అవినీతి రహిత విధానాలకోసం ఇటీవల తీసుకున్న చర్యలను సీఎం అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. 

గతంలో ఏ పని కావాలన్న ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లేవారని, అక్కడకు వెళ్తే కాని పనులు కాని పరిస్థితులు వల్ల అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు ఆస్కారం ఏర్పడిందన్నారు.

అధికార వికేంద్రీకరణ,  గ్రామాలకు అందుబాటులో పాలనను తీసుకురావడం, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చడం అనే లక్ష్యాలను సాధించడానికి గ్రామ, వార్డు సచివాలయాల తీసుకు వచ్చామని వివరించారు. 

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం అవుతాయన్నారు. సచివాలయాలో ఉంచాల్సిన కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రి అంతా చేరుకుంటుందని తెలిపారు. 

గతంలో ఏ పనులు జరగాలని మండల కార్యాలయాలకు వెళ్లేవారో అవే పనులు ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జరుగుతాయని సీఎం వివరించారు. గ్రామ సచివాలయాలతో ఎమ్మార్వో కార్యాలయం, కలెక్టరేట్, రాష్ట్రస్థాయిలో సెక్రటేరియట్‌లు ఒకే ఒక్క బటన్‌తో అనుసంధానం అవుతాయని సీఎం తెలిపారు.దీనికోసం ఐటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీన్నికూడా పరిశీలించాలని అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు.

వాలంటీర్లు, సచివాలయాల పనితీరుపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉంటుందని సీఎం స్పష్టంచేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా పేదలకు, సామాన్యలుకు మంచిచేయడానికేనని పునరుద్ఘాటించారు. అవినీతి, పక్షపాతం లేకుండా అర్హులందరికీ మంచి జరగాలన్నదే ఉద్దేశమని స్పష్టంచేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, తదితర అధికారులు పాల్గొన్నారు.