అలాగైతే చంద్రబాబు కష్టమే ... ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్..? గేమ్ చేంజర్ గా బిజెపి..?
కొన్ని ఎగ్జిట్ పోల్స్ టిడిపికి, మరికొన్ని వైసిపికి అత్యధిక ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా హంగ్ పరిస్థితి వస్తే ఎలా..? అప్పుడు జనసేన, బిజెపి పాత్ర ఎలా వుంటుంది?...
Andhra Pradesh Assembly Elections 2024 : ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసిపి ఈసారి మాత్రం చతికిల పడుతుందని చాలా సర్వేలు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో ఓటమితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతారని ... తిరిగి చంద్రబాబు నాయుడికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా. మిత్రపక్షాలు జనసేన, బిజెపి మద్దతుతో టిడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.
అయితే ఇండియా టుడే - మై యాక్సిస్ తో పాటు మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే ఏపీలో టిడిపి-వైసిపి మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అర్థమవుతోంది. జనసేన, బిజెపి లతో పొత్తు లేకుంటే ఈసారి కూడా వైసిపికి గెలుపు అవకాశాలు... లేకుంటే హంగ్ పరిస్థితి వుండేదట. కానీ ఓట్లు చీలిపోకుండా ముందుగానే జాగ్రత్తపడ్డ టిడిపి వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకుంది... ఇది ఆ పార్టీకి ఎంతో ఉపయోగపడిందట. ఈ పొత్తుల ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే చెబుతున్నాయి.
ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ టిడిపి, బిజెపి, జనసేన కూటమికి 98 నుండి 120 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని ప్రకటించింది. అయితే మూడు పార్టీలకు వచ్చే సీట్లు వేరువేరుగా పరిశీలిస్తే... టిడిపికి 78-96, జనసేనకు 16-18, బిజెపికి 4-6 సీట్లు వస్తాయట. ఇక ఒంటరిగా పోటీచేసిన వైసిపికి 55-77 సీట్లు వచ్చే అవకాశం వుందట. అంటే టిడిపి కూడా ఒంటరిగా పోటీచేసివుంటే పరిస్థితి వేరేలా వుండేదని... హంగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సి వుండేది కాదని ఈ లెక్కలు చెబుతున్నాయి.
అలాగైతే బిజెపితో టిడిపికి కష్టమే..:
తెలుగుదేశం పార్టీ సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్లను సాధిస్తుందనేది ఎక్కవశాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇలాగైతే ఓకే... కానీ ఒకవేళ టిడిపి మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే మాత్రం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన, బిజెపి పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాయి... కానీ ఆ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
టిడిపికి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మ్యాజిక్ ఫిగర్ ను సాధించకుంటే బిజెపికి ఛాన్స్ దొరికినట్లే. ఎన్నికలకు ముందు పొత్తులపై చర్చల సమయంలోనే చంద్రబాబును కాకుండా పవన్ కల్యాణ్ ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రతిపాదించినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది రేపటి ఫలితాల్లో హంగ్ పరిస్థితి వస్తే ఇదే ప్రతిపాదనను బిజెపి మరోసారి తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయి... లేదంటే చెరి రెండున్నరేళ్ల సీఎం పదవికి పట్టుబట్టవచ్చు. ఎలాగూ తనను సీఎం చేయడానికే బిజెపి ప్రయత్నిస్తోంది కాబట్టి పవన్ కల్యాణ్ కూడా ఆపార్టీ పక్షానే వుంటాడు... కాబట్టి బిజెపి షరతులను టిడిపి అంగీకరించకతప్పదు.
ఇక మరో వాదన ఏమిటంటే... బిజెపితో గత ఐదేళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ తో స్నేహంగా వుంది. అధికారికంగా ఎన్డీఏలో చేరలేదు... కానీ ఏ అవసరం వచ్చినా వైసిపి ఎంపీలు మోదీ సర్కార్ కు అండగా నిలిచారు. కాబట్టి వైసిపిపై బిజెపికి మంచి అభిప్రాయమే వుంటుంది. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే టిడిపి, జనసేనలతో బిజెపి కలిసింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఏపీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకుంటే బిజెపి ఏమైనా చేయవచ్చు... ఈ పార్టీ సాయంతో వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా ఆశ్చర్యం లేదనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ ఇలా జరిగే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి.
పవన్ కల్యాణ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా..?
ఈసారి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గతంలో మాదిరిగా వన్ సైడ్ వుండవని అర్థమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను వైసిపి ఏకంగా 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు... వైసిపి, టిడిపి కూటమి మధ్య హోరాహోరీ వుండనుంది... ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి, ఇటీవల ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది.
ఒకవేళ టిడిపి కూటమి విజయం సాధిస్తే అందులో జనసేన, బిజెపి పాత్ర ప్రధానంగా వుండనుంది. టిడిపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు రాకుంటే అప్పుడు పవన్ కల్యాణ్ కీలకం కానున్నారు. ఈసారి జనసేన 15-20 సీట్లు సాధించవచ్చని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇదే జరిగితే పవన్ కల్యాణ్ మరింత ఫవర్ ఫుల్ అవుతారు. అప్పుడు ఆయన కూడా సీఎం రేసులో వుండే అవకాశాలున్నాయి... లేదంటే చంద్రబాబుతో కలిసి ఆ పదవిని పంచుకోవచ్చు. ఏదేమైనా ఈ సారి పవన్ కల్యాణ్ కింగ్ కావడమో లేదంటే కింగ్ మేకర్ కావడమో ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను భట్టి అర్థమవుతోంది.