శ్రీకాకుళం: తప్పులు చేస్తే ఎవరినీ సహించేది లేదని, తాను తప్పు చేసినా కూడా పార్టీ నుంచి తప్పించే విధంగా నిబంధనలను రూపొందిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసైనికులే పార్టీ బలమని, రాత్రికి రాత్రి జనసేన బలాన్ని వ్యవస్థగా మార్చలేమని ఆయన అన్నారు.  విశాఖపట్నంలోని ఓ రిసార్ట్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. 

వైసీపీ అధినేత జగన్‌ రాజకీయ కుటుంబం నుంచి రావడంతో గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత తన పార్టీకి బలంగా మారారని అన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలం పుంజుకుందని చెప్పారు. ఇటువంటి పార్టీలను ఢీ కొట్టాలంటే అంతకు మించిన బలాన్ని సంతరించుకోవాలని అన్నారు.
 
మేధావులకు, అనుభవజ్ఞులకు పార్టీలో ఎలాంటి స్థానం కల్పించాలనే విషయంపై ఆలోచన చేస్తున్న పవన్ కల్యాణ్ చెప్పారు. పార్లమెంటరీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఒక్కో పార్లమెంటు స్థానానికి 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, ఒక ఛైర్మన్‌, పాలనా విభాగం, న్యాయ విభాగం, స్పీకర్‌ ప్యానల్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కమిటీ కాలపరిమితి నాలుగు నెలలు మాత్రమే ఉంటుందని అన్నారు.
 
వారానికోసారి సామాన్యుడితో పార్టీ అధ్యక్షుడు కూర్చొనేలా పార్టీ నిర్మాణం జరుగుతుందని చెప్పా రు. జనసేన రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పడం లేదని అన్నారు. భావితరాల భవిత కోసం రాజకీయాల్లోకి వచ్చానని, మార్పు సాధించి తీరుతామని పవన్‌ అన్నారు.