అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలను చేపట్టింది జగన్ సర్కార్. గిరిజాశంకర్‌కు ఎండోమెంట్‌ అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఇక హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్, నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్‌.హరేంద్రియ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కె.దినేష్‌ కుమార్, తెనాలి సబ్‌ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ లు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవిడ్‌–19, గ్రామ–వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ పనులు–గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, స్కూళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులలో నాడు–నేడు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. 

read more   11వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం... నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

ఈ సమీక్ష సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేవారు ఎవరైనా సరే వదలొద్దని స్పష్టం చేశారు.ఈ అంశాల్లో ఎవరిని ఉపేక్షించొద్దన్న జగన్.. అక్రమ పనులు ఏవైనా అస్సలు ఊరుకోవద్దని ఆదేశించారు. ఈ విషయంలో తాను అండగా ఉంటానని అధికారులకు హామీ ఇచ్చారు జగన్.

ఎరువుల సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కొన్ని జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.