అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 42 మంది ఐఎఎస్ లను బదిలీ చేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడి పేషిలో పనిచేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను జిఎడికి అటాచ్ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎంవోలో పనిచేసిన సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్ లకు పోస్టింగులు ఇవ్వలేదు. యూనిఫాం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న సర్వశిక్ష అభియాన్ ఎస్పీడి గుర్రాల శ్రనివాస రావును జిఎడికి అటాచ్ చేసింది. ఖనిజాభివృద్ధి సంస్థలో పనిచేసిన వెంకయ్య చౌదరిని కూడా జిఎడి అటాచ్ చేసింది. 

కీలకమైన ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్ర సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ అయ్యారు. గతంలో జిఎడికి పంపిన అధికారులకు ఇప్పుడు పోస్టింగులు లభించాయి. పోస్టు కోసం ఎదురు చూస్తున్న శశిభూషణ్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించారు. 

అదే విధంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రంజీత్ బాషాను గిరిజ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. అదే విధంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సాగిలిన షాన్ మోహన్ ను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న గౌతమిని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. ఆమె స్థానంలో పనిచేస్తున్న కోటేశ్వర రావును జిఎడికి పంపించారు.