తెలంగాణలో ఆయనను వద్దనుకున్నారు... అందుకే ప్రాధాన్యం లేని పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన అసంతృప్తి చెంది... ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు ఏపీలో కీలక పదవి దక్కింది. ఆయన ఎవరోకాదు.. తెలంగాణ పూర్వ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆకునూరి మురళికి గతంలో తెలంగాణలో ప్రాధాన్యం లేని పదవికి అప్పగించారు. దీంతో... ఆయన ఆ పదవికి వెంటనే రాజీనామా చేశారు. కాగా... ఇప్పుడు ఆయనకు ఏపీలో కీలక పదవి దక్కింది. మురళిని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య(మౌలిక సదుపాయాల కల్పన) సలహాదారుడిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా మురళిని బదిలీ చేసిన ప్రభుత్వం... తెలంగాణ స్టేట్‌ ఆర్కీవ్స్‌ సంచాలకుడిగా అప్రాధాన్యపోస్టులో నియమించింది. ఆ తర్వాత ఆయన.. రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బాహాటంగా వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం అదే పోస్టులో కొనసాగించడంతో మరో 10 నెలల సర్వీసు ఉండగానే జూలై 27వ తేదీన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయగా సెప్టెంబరు 16న తెలంగాణ ప్రభుత్వం అమోదించింది.