ఉప ఎన్నికల్లో పోటీ చేయను: తేల్చేసిన గంటా శ్రీనివాసరావు
తన రాజీనామా వ్యక్తిగతమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు.
విశాఖపట్టణం: తన రాజీనామా వ్యక్తిగతమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు.
ఆదివారం ఒక తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వూలో గంటా శ్రీనివాసరావు పలు కీలక విషయాలను వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో అన్ని రాజకీయపార్టీల పాత్ర ఉందని విమర్శించారు.
పార్టీలకు అతీతంగా అందరూ పోరాడితేనే స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ పంథాలను పక్కన పెట్టి ఉద్యమంలోకి రావాలని గంటా కోరారు.
తన స్ఫూర్తితో మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ఆశిస్తున్నాని ఆయన చెప్పారు. పోరాటాల ద్వారానే స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టుకోగలమన్నారు.స్పీకర్ తన రాజీనామా అమోదిస్తారనుకుంటున్నానని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ఎవరైనా నాన్ పొలిటికల్ వ్యక్తిని తన స్థానంలో పోటీ చేయించాలని ఆయన సూచించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు.
ఈ విషయమై గంటా శ్రీనివాసరావు తీరుపై వైసీపీ విమర్శలు గుప్పించింది. దీంతో ఆయన స్పీకర్ ఫార్మాట్ లో ఈ నెల 12న రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామా లేఖలు సోమవారం నాడు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి చేరుకొన్నాయి.