హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ వాదనతో ఏకీభవించడంలేదు: గోవిందానంద సరస్వతి
హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీతో ఏకీభవించడం లేదని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి చెప్పారు.
తిరుమల: హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీతో ఏకీభవించడం లేదని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి చెప్పారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని గత మాసంలో టీటీడీ ప్రకటించింది. అయితే హనుమంతుడి జన్మస్థలం కిష్కింధలోని అంజనాద్రేనని గోవిందానంద సరస్వతి చెప్పారు. ఈ విషయమై ఇవాళ తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఆయన డిబేట్ లో పాల్గొన్నారు. డిబేట్ అసంపూర్తిగానే ముగిసింది. ఈ డిబేట్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
also read:హనుమంతుడి జన్మస్థలంపై వివాదం: టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ల మధ్య చర్చలు
హనుమంతుడి జన్మస్థలంపై బహిరంగ చర్చ అని చెప్పి అంతర్గత చర్చ పెట్టారని ఆయన విమర్శించారు. కనీసం మీడియాను కూడ అనుమతించలేదన్నారు. టీటీడీ చూపుతున్న ఆధారాలకు ప్రామాణికం లేదని చెప్పారు. రామాయణం ప్రకారంగా హనుమంతుడు హంపిలోనే జన్మించారని ఆయన చెప్పారు. ఏ మఠాధిపతిని సంప్రదించకుండానే టీటీడీ హనుమంతుడి జన్మస్థలంపై ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయమై శంకారాచార్యులతో పాటు పలువురు పీఠాధిపతులకు ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు.