అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల విషయమై  ఒత్తిడి తెచ్చేందుకు  ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష చేయాలని భావిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన  ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
అయితే ఈ సమావేశానికి విపక్షాలన్నీ కూడ దూరమయ్యాయి. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మాత్రమే  ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో  ఢిల్లీ వేదికగా  ఒక్క రోజు  నిరహార దీక్ష చేయనున్నట్టు చెప్పారు. అయితే కేంద్ర బడ్జెట్ కంటే ముందుగానే ఈ దీక్ష చేయాలనే యోచనలో ఉన్నట్టు బాబు చెప్పారు. ఈ విషయమై అభిప్రాయాలను చెప్పాలని ఆయన ప్రజా సంఘాలను, ఉద్యోగ సంఘాల నేతలను కోరారు.

పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు  రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొందని  కొందరు తప్పుడు ప్రచారం చేశారని  బాబు విమర్శలు గుప్పించారు.

విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు.  జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కూడ అమలు చేయడంలో  కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడ ఇవ్వకుండా తొక్కి పట్టారని బాబు విమర్శించారు. ఈ విషయమై కోర్టుకు వెళ్లినట్టు చెప్పారు.

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో కూడ కేంద్రం ఇలానే చేసిందన్నారు. ఈ విషయమై  కేంద్రం ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినట్టు బాబు గుర్తు చేశారు.

విశాఖ రైల్వే జోన్ విషయంలో  తాము అభ్యంతరం .పెట్టడం లేదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కానీ, కొన్ని డివిజన్లను తమకు ఇవ్వాలని చెప్పారు.