విశాఖపట్టణం:ఢిల్లీ యాత్ర నుండి వచ్చిన తర్వాత  తాను ఏ పార్టీలో చేరేది ప్రకటించనున్నట్టు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. తనను ఇప్పటికే పలు పార్టీలు ఆహ్వానించినటట్టుగా ఆయన గుర్తు చేశారు.

విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.  ఏపీకి ప్రత్యేక హోదా,  విభజన హామీల అమలు, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను జనఘోష పేరుతో ఢిల్లీకి రైలు యాత్రను చేపట్టారు రామకృష్ణ.

ఏపీ సమస్యలపై కేంద్ర మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఏపీకి చెందిన నేతలపై మోడీకి కోపం ఉంటే  వేరే రకంగా చూడాలన్నారు. కానీ, ఏపీ ప్రజలకు అన్యాయం చేయకూడదని కొణతాల రామకృష్ణ సూచించారు.

ఏపీ ప్రజల ఘోష వినిపించేందుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుతూ జనఘోష రైలు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరనున్నట్టు చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఐదు రోజులు ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు నల్ల దుస్తులు ధరించి వినూత్నంగా నిరసన తెలుపుతామన్నారు. 

ఈ ఢిల్లీ యాత్ర ముగిసిన తర్వాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు కొణతాల రామకృష్ణ ప్రకటించారు.ఇప్పటికే పలు పార్టీలు చేరమంటూ ఆహ్వానిస్తున్నాయన్నారు. త న మిత్రులు, సన్నిహితులతో చర్చించిన పిదప నిర్ణయం తీసుకుంటామన్నారు.