గుంటూరు: విశాఖపట్నం ప్రజలంటే తనకే ఎక్కువ ప్రేమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రాబాబు నాయుడు తెలిపారు. అందువల్లే ఆ ప్రాంత అభివృద్ది కోసం భోగాపురం ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టామన్నారు. గత పాలనలో అన్ని సమావేశాలు, సదస్సులు విశాఖలోనే పెట్టామన్నారు. ఇలా విశాఖలో ఎన్నోఅభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. విశాఖను ముంబై తరహాలో ఆర్ధిక రాజధానిగా, టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని చూశామని చంద్రబాబు పేర్కొన్నారు. 

శుక్రవారం సాయంత్రం చంద్రబాబు వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం, అమరావతి నుండి రాజధానిని తరలించడం వల్ల జరిగే నష్టాలగురించి మీడియాతో మాట్లాడారు. రాజధానిగా అమరావతిని నిర్ణయించడానికి ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆ తర్వాతే అమరావతిని ఎంపికచేశామని తెలిపారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులు పెడితే కర్నూలు వాళ్లు శ్రీకాకుళం వెళ్లాలంటే ఎలా వెళ్తారు?అని చంద్రబాబు ప్రశ్నించారు. 

''మేము తీసుకొచ్చిన ప్రాజెక్టులను భ్రష్టు పట్టించారు. హైదరాబాద్ కంటే మెరుగ్గా గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. నేను విమర్శలకు భయపడి ఉంటే హైదరాబాద్ ను అభివృద్ధి చేసేవాడిని కాదు'' అని అన్నారు. 

read more   అన్నీ అనుకూలంగా ఉన్నందునే రాజధానిగా అమరావతి ఎంపిక: చంద్రబాబు

 ''పట్టిసీమను పూర్తి చేశాం. అలాగే  మిగతా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేశాం. వైసీపీ నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఎన్నికల్లో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి మళ్లీ మోసం చేశారు. వాళ్లంతా కట్టు బానిసలు. ఎవరు ఏది చెబితే వారికి భజన చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రాష్ట్ర ప్రయోజనాలే నా ప్రయోజనాలు. నాకు ఎప్పుడు కులం లేదు జగన్ వచ్చిన తర్వాతే నాకు కులం అంటగడుతున్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసేటప్పుడు ఈ కులం వచ్చిందా? అమరావతిలో ఎందుకు వస్తుంది. అమరావతి నా స్వార్థం కోసం కాదు... ప్రజల కోసం'' అని అన్నారు. 

''సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని నేను. నన్ను ఏం చేయలేక నాపై కులం ముద్ర వేశారు. మనం ఇప్పుడు పోరాడకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే కరోనాపై నేను మాట్లాడితే విమర్శించారు. ఇప్పుడు దేశంలో కరోనా కేసుల పెరుగుదలలో ఏపీ ముందుంది. రాష్ట్ర ప్రయోజనాలే  నా ప్రయోజనాలు.  అమరావతి మనందరి బాధ్యత అని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.