అమరావతి: అన్నీ అనుకూలంగా ఉన్నందునే  అమరావతిని రాజధాని కోసం ఎంపిక చేశామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం నాడు సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని ఆయన అన్నారు.  అమరావతికి ప్రఖ్యాత యూనివర్శిటీలు వచ్చేలా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

హైటెక్ సిటీ తర్వాత హైద్రాబాద్ కు అనేక ప్రాజెక్టులు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటి వల్లే హైద్రాబాద్ కు అధిక ఆధాయం వస్తోందన్నారు.కులాన్ని చూసి హైద్రాబాద్ ను అభివృధ్ది చేశానా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు హైటెక్ సిటీ ఆయువుపట్టుగా మారిందన్నారు. హైటెక్ సిటీ నిర్మించే సమయంలో కూడ తనపై విమర్శలు చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

అమరావతిని కాపాడుకోవడం ప్రజల కర్తవ్యంగా ఆయన పేర్కొన్నారు. అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తోందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు వచ్చేలా అనేక ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

తలసరి ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో అనేక ప్లాన్స్ చేసినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం విశాఖపట్టణం అని ఆయన గుర్తు చేశారు.  160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించినట్టుగా చంద్రబాబు చెప్పారు.  దేశంలలో వచ్చే 65 శాతం ఆదాయం కేవలం 5 నగరాల నుండే వస్తోందన్నారు.