అమరావతి: ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ టీమ్ లో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానంద పాత్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవిని ఇచ్చారు. ఆయనను సమాచార, పౌర సంబంధాల శాఖలోని సోషల్ మీడియా చీఫ్ డైరెక్టర్ గా నియమిస్తూ సమాచార, పౌరసంబంధాల శాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక కార్యదర్శి టి. విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సీవీ రెడ్డిని కూడా సమాచార, పౌర సంబంధాల శాఖలోని సోషల్ మీడియా చీఫ్ డైరెక్టర్ గా నియమించారు. బ్రహ్మ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ లో కీలక పాత్ర పోషించారు. బ్రహ్మ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కాగా, సీవీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందినవారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ పనిచేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీ విజయం కోసం కృషి చేసిన బృందంలో బ్రహ్మ అత్యంత కీలకమైన పాత్ర పోషించారు.