వైసీపీలో నా కల నెరవేరుతుందని అనిపించలేదు.. అందుకే జనసేనలోకి - అంబటి రాయుడు
జనసేన (Jana Sena) చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) భావజాలం, దృక్పథం తనకు దగ్గరగా ఉన్నాయని, అందుకే ఆ పార్టీలో చేరానని క్రికెటర్ అంబటి రాయుడు (cricketer ambati rayudu) తెలిపారు. వైఎస్ ఆర్ సీపీలో తన కల నెరవేరుతుందని అనిపించలేదని చెప్పారు.
వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు చివరికి జనసేనలోకి చేరారు. ఆయన వైసీపీలో చేరడం, ఆ పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైసీపీని వీడిన వారం రోజుల్లోనే జనసేనలోకి చేరుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే అంబటి రాయుడు జనసేనలోకి ఎందుకు చేరాల్సి వచ్చిందో తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో తెలియజేశారు. వైసీపీలో తన కల నెరవేరుతుందని అనిపించలేదని తెలిపారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావజాలం, తన భావజాలం దాదాపు ఒకేలా ఉందని, అందుకే ఆ పార్టీలో చేరానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఏపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. వైసీపీపై తాను ఎలాంటి నిందలు వేయదల్చుకోలదని అన్నారు.
‘‘స్వచ్ఛమైన సంకల్పంతో, హృదయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. నేను వైఎస్ ఆర్ సీపీలోకి చేరి నా విజన్ ను నెరవేర్చుకోగలనని అనుకున్నాను. నేను గ్రౌండ్ లో ఉంటూ అనేక గ్రామాలను సందర్శించి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. వ్యక్తిగతంగా వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేశాను. సామాజిక సేవ చేశాను.’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘అయితే కొన్ని కారణాల వల్ల వైఎస్ ఆర్ సీపీతో ముందుకు సాగితే నా కల నెరవేరుతుందని నాకు అనిపించలేదు. అయితే నేను ఆ పార్టీపై ఎలాంటి నిందలు వేయడం లేదు. నా భావజాలం, వైఎస్ ఆర్ సీపీ సిద్ధాంతాలు కలవడం లేదు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు ఆయనను ఒక సారి కలవాలని నాకు సూచించారు.’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు.
‘‘ వారి సూచనతో నేను పవన్ అన్నను కలిశాను. జీవితం, రాజకీయాల గురించి చర్చించేందుకు, అర్థం చేసుకోవడం కోసం నేను ఆయనతో చాలా సమయం గడిపాను. ఆయన భావజాలం, దృక్పథం నాకు దగ్గరగా ఉన్నాయని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయనను కలిసినందుకు చాలా సంతోషించాను. నా క్రికెట్ కమిట్‌మెంట్‌ల కోసం నేను దుబాయ్‌కి బయలుదేరాను. నేను ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటాను’’ అని అంబటి రాయుడు ‘ఎక్స్’ పోస్ట్ లో పేర్కొన్నారు.