కాకినాడ: దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా వ్యాధి సోకినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.  ఏపీ ప్రభుత్వం ఈ విషయమై అప్రమత్తమైంది.

తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం వాడవాలెం గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విధుల నిర్వహణ నిమిత్తం దక్షిణ కొరియాకు వెళ్లాడు. దక్షిణ కొరియా నుండి ఆయన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

Also read:భారత్‌లో మరో కరోనా కేసు: ఆరుకు చేరిన బాధితులు, రంగంలోకి కేంద్రం

హైద్రాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసే ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.అయితే ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. 

హైద్రాబాద్ నుండి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు అధికారులు సమాచారం పంపారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు సమాచారం పంపారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖాధికారులు టెక్కీ ఇంటికి వెళ్లారు. 

అయితే  అతను అప్పటికే తన అత్తిల్లు గోదశపాలెం వెళ్లినట్టుగా గుర్తించారు. గోదశపాలెంలో ఆయన వద్దకు చేరుకొని పరీక్షల కోసం అతనిని ఆసుపత్రికి తరలించారు.

టెక్కీకి కరోనా వ్యాధి వచ్చిందా లేదా అనే విషయమై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.