వారిద్దరూ ఒకరిని మరొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.  పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆనందంగా వారి జీవితం సాగిపోతోందనుకునే సమయంలో... భర్త మెదడులో అనుమానపు బీజం పడింది. అంతే వారి జీవితాలు అల్లకల్లోలమయ్యాయి.  అదే అనుమానంతో భర్త... ప్రేమించి పెళ్లాడిన భార్య కాళ్లు నరికేశాడు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లాలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  తూగుండ్రం పంచాయతీ ఆరిమాకులపల్లెకు చెందిన వెంకటస్వామి కుమార్తె నాగమ్మ(24)ను పెనుమూరు మండలం సాతంబాకం పంచాయతీ రామాపురానికి చెందినసతీష్‌(26) ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఏడాది క్రితం నాగమ్మ వేరే వ్యక్తితో వెళ్లిపోగా, పెద్ద మనుషుల సమక్షంలో ఇరుకుటుంబాల వారు పంచాయతీ పెట్టారు. దీంతో నాగమ్మను మళ్లీ కాపురానికి తీసుకొచ్చాడు.

 కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మళ్లీ వివాదాలు ఏర్పడడంతో నాగమ్మ ఇద్దరు పిల్లల్ని భర్త వద్దే వదిలి అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పది గంటలకు సతీష్‌ ఆరిమాకులపల్లె శివార్లకు వచ్చి ఫోన్‌ చేసి భార్యను రమ్మనగా ఆమె వచ్చింది. అయితే కాపురానికి రాననడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన సతీష్‌ సమీపంలోని ఓ కొట్టంలో ఉన్న కత్తి తీసుకుని విచక్షణారహితంగా రెండు కాళ్లు, చేతిని నరికేశాడు. 

దీంతో కాళ్లు వేరుపడి వేలాడాయి. నాగమ్మ గట్టిగా అరవడంతో సతీష్‌ పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో పడివున్న నాగమ్మను స్థానికులు 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి, పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. సతీష్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రావు తెలిపారు.