తాగుడు మరోసారి పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. తాగుడు మానేస్తేనే ఇంటికి వస్తానని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం  గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తికి 17 ఏళ్ల క్రితం రాణి అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు..మొదట సవ్యంగానే నడిచిన వీరి కాపురంలోకి మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది.

కొద్దిరోజుల క్రితం మద్యానికి బానిసైన నాగేశ్వరరావు రోజూ తాగివచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఇంతకాలం అతని హింస భరించిన రాణి.. ఈ నెల 10న పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ తర్వాతి రోజు నాగేశ్వరరావు అత్తారింటికి వెళ్లి భార్యను ఇంటికి తిరిగి రమ్మని అడిగాడు.. తాగుడు మానేస్తేనే ఇంటికి వస్తానని ఆమె తేల్చి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి అదే రోజు సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడి చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.