ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపింది మరో ఇల్లాలు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన చెల్లూరి రాంబాబు, చెల్లూరి క్రాంతి ప్రియదర్శిని 17 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.. ఇన్నేళ్ల నుంచి అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది.

స్థానిక శీలంవారి సావరానికి చెందిన కుడుపూడి మోహన శివసాయి కిశోర్‌తో క్రాంతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తెలిసి అడ్డు తొలగించుకోవాలని భావించింది. పథకం ప్రకారం గత నెల 26న భర్త రాంబాబుకు మత్తు మందు కలిపిన భోజనం పెట్టింది..

అనంతరం నిద్రపోయేందుకు మంచం మీద పడుకున్న భర్త కాళ్లు, చేతులను ప్రియుడితో కలిసి కట్టేసింది. దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చింది. పోలీసులకు తానే చంపానని చెబుతానని.. తనను అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తీసుకోవాలని చెప్పి శివసాయికి రూ.2 లక్షలు ఇచ్చింది. అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కథ తెలిసింది. తొలుత అనుమానాస్పద మృతిగా ఉన్న కేసును హత్యగా నిర్థారించి క్రాంతి, కిశోర్‌ను రిమాండ్‌కు తరలించారు.