భార్య, భర్తల మధ్య గొడవ జరిగితే... వాళ్ల మధ్యలో మరో వ్యక్తి దూరం కరెక్ట్ కాదని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి విశాఖ  జిల్లాలో చోటుచేసుకుంది. భర్తతో గొడవై స్నేహితురాలు బాధపడుతోందని.. ఆమెకు ధైర్యం చెప్పాలని ఓ మెసేజ్ చేశాడు. అలా మెసేజ్ చేసినందుకు అతని ప్రాణం మీదకే వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొమ్మాదికి చెందిన సూరజ్ సాహు.. విశాఖ వీఐపీ రోడ్డులోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆ కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న వస్త్ర దుకాణంలో శ్యామల అనే మహిళ పనిచేస్తోంది. ఆమె భర్త రాజ్ కుమార్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల రాజ్ కుమార్, శ్యామల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయి.

దీంతో... భర్త తనను అనవసరంగా తిడుతున్నాడంటూ తన స్నేహితుడు సేల్స్ మెన్ సూరజ్ వద్ద శ్యామల బాధపడింది. స్నేహితురాలు అలా బాధపడటం చూడలేకపోయిన సూరజ్ సాయంత్రం ఆమెకు ధైర్యం నింపేలా ఓ మెసేజ్ చేశాడు. భార్య, భర్తల మధ్య గొడవలు జరగడం సహజమని, కాస్త సర్దుకుంటే సరిపోతుందంటూ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ శ్యామల భర్త రాజ్ కుమార్ చేశాడు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

ఆ సూరజ్ ని ఎలాగైనా చంపేయాలని పథకం వేశాడు. సోమవారం సాయంత్రం జేబులో కత్తిపెట్టుకొని వెళ్లి... సూరజ్ పై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు గట్టిగా అరవడంతో.. రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. సూరజ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.