తణుకు: తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు భార్యపై కోపాన్ని పెంచుకున్న ఓ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా వున్న ఆమెపై కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ విషాద సంఘటన తణుకులో చోటుచేసుకుంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండపాటూరి వరలక్ష్మి(31)కి పదేళ్ల కిందట కృష్ణా జిల్లాకు చెందిన రత్నాకరరావుతో వివాహమైంది. అయితే వీరికి ఓ పాప పుట్టాక రత్నాకరరావు మృతిచెందాడు. దీంతో అతడి ఆస్తిని కూతురు పేరిట చేసి వరలక్ష్మికి తాడేపల్లిగూడెం మండలం దండగర్రకు చెందిన పచ్చల శ్రీనుతో రెండో పెళ్లి చేశారు. 

అయితే పెళ్లయిన కొత్తలో బాగానే వున్న శ్రీను ఆ తర్వాత నిజస్వరూపాన్ని భయటపెట్టాడు. కూతురు పేరిట బ్యాంకులో వున్న డబ్బులు తీసుకురావాలంటూ వేధించడం ప్రారంభించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక కూతురు పేరిట వున్న రూ.4లక్షలను బ్యాంక్ నుండి తీసుకువచ్చి ఇచ్చింది వరలక్ష్మి. ఆ డబ్బులను అతడు జల్సాల కోసం ఖర్చుచేశాడు. 

భర్త తాగుడుకు బానిసై తన కూతురి డబ్బులతో జల్సాలు చేస్తుండటంతో వరలక్ష్మి తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. అతడి వద్ద మిగిలిన డబ్బులను తనకు ఇప్పించాలంటూ పెద్దల వద్ద పంచాయితీ పెట్టింది. దీంతో లక్ష రూపాయలు తిరిగివ్వాలని పెద్దలు సూచించారు. దీంతో భార్యపై మరింత కోపాన్ని పెంచుకున్న శ్రీను దారుణానికి ఒడిగట్టాడు. 

పెద్దమ్మ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి ఒంటరిగా వుండగా కత్తితో దాడికి పాల్పడ్డాడు భర్త శ్రీను. పదునైన కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వరలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది.