వారికి పదేళ్ల క్రితమే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతోందనుకునేలోపు వాళ్ల మధ్యలోకి మరో వ్యక్తి వచ్చాడు. భార్య అలా వివాహేతర సంబంధం పెట్టుకోవడం భర్తకు నచ్చలేదు. దీంతో...ఆమెను తన సోదరుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... గోవిందరాయునిపేటకు చెందిన ఫకృద్దీన్‌ 12 ఏళ్ల కిందట శింగనమలకు చెందిన శంషాద్‌ను వివాహం చేసుకున్నాడు. మేకలు మేపుకుంటూ దంపతులు జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా తన భార్య శంషాద్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు ఫకృద్దీన్‌ అనుమానించాడు. 

ఇదే విషయాన్ని తన బావమరిది దాదాఖలందర్‌కు వివరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని భావించిన ఫకృద్దీన్‌ ఆమెను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగా సోదరుడు దస్తగిరితో కలిసి ఈనెల 7వతేదీ సాయంత్రం ఇంటి సమీపంలోని మాల కొండపైన మేకలను మేపుతున్నాడు. మేకల వద్దకు రావాలని తన భార్యకు ఫోన్‌ చేసి పిలిచాడు. దీంతో శంషాద్‌ కొండపైకి వెళ్లింది. 

అప్పటికే కాపుకాచిన భర్త ఫకృద్దీన్‌, ఆమె మరిది దస్తగిరిలు ఆమెపై రాళ్లతో దాడి చేసి హత మార్చారు. అనంతరం పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పు పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే శంషాద్‌ది ఆత్మహత్య కాదని, హత్యచేశారని కొందరు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శంషాద్‌ను తామే చంపినట్లు భర్త ఫకృద్దీన్‌, మరిది దస్తగిరి ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.