వారిద్దరి కులాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమకు పెద్దల చేత అంగీకారాన్ని పొందిమరీ ఆదర్శ వివాహం చేసుకున్నారు. అయితే కొత్త జీవితాన్ని మాత్రం ఆదర్శంగా కొనసాగించలేకపోయారు. నిత్యం భార్యాభర్తల మద్య గొడవలు ఎక్కువై ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే భర్త హతమార్చే స్ధాయికి చేరుకున్నాయి. ఈ  దారుణం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.   అనంతపురం పట్టణానికి చెందిన సరోజ, రాప్తాడుకు చెందిన జగదీశ్వర్ రెడ్డిలు ప్రేమించుకున్నారు. దీంతో పెద్దలను ఒప్పించి మరీ తొమ్మిది నెలల క్రితంమ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుండే వీరి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో అన్యోన్యంగా సాగాల్సిన వీరి సంసారం గందరగోళంగా తయారయ్యింది.

ఈ గొడవల కారణంగా జగదీశ్వర్ రెడ్డి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్య సరోజ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున భార్యను తీసుకుని బైక్ పై భయటకు వచ్చాడు. తన ప్లాన్ లో భాగంగా ఎదురుగా వస్తున్న లారీని ప్రాణాపాయం లేకుండా బైక్ తో ఢీకొట్టాడు. దీంతో భార్యాభర్తలిద్దరికి  స్వల్ప గాయాలయ్యాయి. గాయాలతో కిందపడిపోయిన భార్య తలపై బండరాయితో బాది హత్య చేశాడు. 

అనంతరం తనకేమీ తెలియనట్లు అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోగా అతడు అదే ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందాడు. పోలీసుల  దర్యాప్తులో కూడా రోడ్డు ప్రమాదం కారణంగానే తన భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. 

అయితే అతడి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించడంతో వాస్తవాన్ని బయటపెట్టాడు. దీంతో  పోలీసులు కేసు నమోదు చేసి జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.