అనుమానంతో ఓ భర్త భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన కుప్పంలో కలకలం రేపింది.
కుప్పం : వివాహేతర సంబంధాలే కాదు.. ఆ సంబంధాలున్నాయేమో అనే అనుమానాలు కూడా కాపురాలకు గొడ్డలిపెట్టులా మారుతున్నాయి. పచ్చని సంసారాల్ని నిలువునా కూల్చేస్తున్నాయి. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, కుప్పంలో చోటు చేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. అది పెనుభూతంగా మారడంతో ఆమెను కర్కశంగా హతమార్చాడు. భార్యను కిరాతకంగా చంపిన తరువాత పోలీస్స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు. కుప్పంలోని శాంతిపురం మండలంలో సోమవారం వెలుగు చూసింది.
రాళ్ళబూదుగురు పంచాయతీ శెట్టిగానికురుబూరుకు చెందిన మురుగేష్ కు, రామకుప్పం మండలం కిలాకిపోడు గ్రామానికి చెందిన మునెమ్మ(38)తో 22యేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు శివరామరాజు, కుమార్తె హారతి. కుమార్తెకు వివాహం అయ్యింది. కుమారుడితో పాటు మురుగేష్, మునెమ్మ దంపతులు శెట్టిగానికురుబూరు వద్ద రాతి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అందమే పెను శాపమా? అనుమానంతో భర్త దారుణం
ఈ క్రమంలో భార్య నడవడికపై మురుగేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ గొడవ పడేవాడు. భార్యను హింసించేవాడు. అలాగే, ఆదివారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. రాతి పనికి ఉపయోగించే ఇనుప సుత్తితో మునెమ్మ తలపై మోదాడు. ఆ తరువాత గొంతునులమడంతో ఆమె చనిపోయింది. తండ్రి చేతిలో తల్లి హత్యకు గురైన ఘటన గమనించిన కుమారుడు శివరామరాజు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు ముందే మురుగేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మునెమ్మ మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈనెల మొదటి తేదీన తెలంగాణలోని మహబూబ్ నగర్ లో వెలుగు చూసింది. ఓ భర్త అనుమానంతో భార్యని తెగనరికాడు. దీంతో అప్పటి వరకు భార్యా పిల్లలతో కళకళలాడుతున్న ఇల్లు స్మశానంలా మారిపోయింది. ఆవేశంతో భార్యను హతమార్చిన భర్త జైలు పాలయ్యాడు.. ఏం జరుగుతుందో తెలియని ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఆ పసివారి ఏడుపులు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సీఐ జగదీశ్వరరావు తెలిపిన కథనం మేరకు…
మహబూబ్ నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలానికి చెందిన ఆముదాల గడ్డ తండా నివాసి లలిత (28), మౌలాలిలోని హనుమాన్ నగర్ లో ఉండే శంకర్తో పదేళ్ల కిందట ఆమెకు వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్లు, మూడేళ్ల కుమారులు సంతానం. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భార్య లలిత తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త శంకర్.
ఈ విషయమై తరచూ భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడేవారు. ఆ రోజు కూడా వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో భర్త శంకర్ పక్కనే ఉన్న చెక్కతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శంకర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
