ఓ భర్త క్షణికావేశంలో భార్యను చపాతీ కర్రతో కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. అక్కడినుంచి పారిపోయిన అతను సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒంగోలు : క్షణికావేశం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆ సమయంలో వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం.. విచక్షణ మరచి ప్రవర్తించడంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అలాంటి ఓ ఘటనే ఒంగోలులో తీవ్ర విషాధాన్ని నింపింది. క్షణికావేశం నిండు కుటుంబాన్ని ఒక్క రాత్రిలో తలకిందులాగా చేసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహాలు.. తద్వారా క్షణికావేశం ఇద్దరు చిన్నారులను అనాధలుగా మార్చేసింది. డాకా అంజిరెడ్డి (42), పూర్ణిమ (39) దంపతులు. వీరిద్దరూ ఒంగోలు నగరంలోని విరాట్ నగర్ లో నివసిస్తున్నారు. ఇంటి దగ్గరే అంజిరెడ్డి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కాగా పూర్ణిమ ఆర్పీగా పనిచేస్తుంది.
ఇద్దరు పిల్లలతో అందమైన కుటుంబం వీరిది. ఇద్దరూ కూతుర్లే. కాగా తరచుగా ఏదో విషయంలో భార్యాభర్తలిద్దరికీ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది. తన మాటకే ఎదురు చెబుతుందా అని అంజిరెడ్డి క్షణికావేశానికి గురయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న చపాతి కర్రను తీసుకొని భార్య తల మీద గట్టిగా ఒకటి వేశాడు. ఆ దెబ్బకు భార్య తలకి తీవ్ర గాయమై రక్తస్రావం అధికంగా కాసాగింది.. ఆ రక్తాన్ని చూసిన అంజిరెడ్డి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.
గుంటూరు జిల్లాలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య..
ఇది గమనించిన పిల్లలు బంధువుల సహాయంతో పూర్ణిమను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పూర్ణిమ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. భార్యను చపాతీ కర్రతో కొట్టి ఆమె చావుకు కారణమైన అంజిరెడ్డి అక్కడి నుంచి పారిపోయి.. కొత్తపట్నం సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్ణిమ మృతి కేసులో అంజిరెడ్డిని వెతుకుతున్న పోలీసులకు మంగళవారం ఉదయం కే పల్లెపాలెం తీర ప్రాంతం వద్ద ఆయన మృతదేహం దొరికింది.
భార్య భర్తల మృతదేహాలకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వారిద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. భార్య భర్తలు ఇద్దర్లో క్షణికావేశంలో ఒకరు హత్యకు గురికాగా.. మరొకరు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ఆ కూతుర్లిద్దరూ కన్నీరు మున్నీరవుతున్నారు. వారి దు:ఖాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు. దీనిమీద మృతుడికి సోదరుడు వరుసయ్యే పి. ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
