సాధారణంగా మనకు ఎవరిపైన అయినా విపరీతమైన పగ, ద్వేషం ఉంటే వారిని చంపి ఉప్పు పాతర వేస్తానంటూ మందలిస్తూ ఉంటాం. అది కేవలం మాట వరసకు మాత్రమే. అయితే ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపి ఉప్పు పాతర వేశాడు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరావు‌కు పెదవేగి మండటం మొండూరులోని తన సొంత అక్క కూతురైన రామలక్ష్మీతో 13 ఏళ్ల కింద వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు మద్యం తాగే అలవాటు ఉంది. దీనికి తోడు భార్యపై అనుమానంతో ప్రతి రోజు తాగి వచ్చి ఆమెతో గొడవలు పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు భార్యపై లైంగిక దాడికి యత్నించాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన నిందితుడు శవాన్ని దుప్పటిలో చుట్టి మంచం కింద దాచేశాడు.

అనంతరం ఉదయాన్నే ఇద్దరు పిల్లలను మొండూరులోని అత్త గారింట్లో వదిలి వచ్చాడు. అనంతరం ఇంటికి వచ్చి తమ్ముడు, మరదలికి పరిస్ధితిని చెప్పాడు. ఆ తర్వాత తన ఇంటి ఆవరణలో నీటి ట్యాంక్ నిర్మించేందుకని ఏడు అడుగుల గొయ్యిని తవ్వించాడు.

అనంతరం రామలక్ష్మీ మృతదేహాన్ని అందులో వేసి వాసన రాకుండా ఉప్పు పాతర వేసి, సమాధి కట్టేశాడు. గ్రామంలోని వారికి తన భార్య ఇళ్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పాడు. అయితే రెండ్రోజుల క్రితం ఫుల్లుగా మద్యం తాగి తన భార్యను తానే చంపానని నోరు జారడంతో విషయం గ్రామస్తులకు తెలిసింది.

అందరికి హత్య విషయం తెలిసిపోవడంతో చేసేది లేక శ్రీనివాసరావు పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం పోలీసులు నిందితుని ఇంటి ఆవరణలో పాతిపెట్టిన రామలక్ష్మీ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.