తణుకు: పెళ్లికి ముందే ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. అది దాచిపెట్టి మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం వాళ్లకి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను మాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తాళికట్టిన భర్త, అత్తమామలు ఏమైనా అంటే భరించేది. 

కానీ భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వేధిస్తుండటంతో ఆమె తట్టుకోలేక పోయింది. తాను కలకన్న జీవితం ఇదికాదని నిర్ణయించుకుంది. తనకు మాత్రమే సొంతం అవుతాడనుకున్న భర్త వేరోక మహిళతో ఉండటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే తణుకు కు చెందిన కాళిశెట్టి శివకుమార్ ఎస్ బీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమమంలో ఆచంట మండలం కొడమంచిలి గ్రామానికి చెందిన తమ్మిన సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమార్తె అనంతలక్ష్మిని ప్రేమించాడు. కులాలు వేరుకావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు కుటుంబ పెద్దలను ఎదిరించి 2015 ఏప్రిల్ 22న ద్వారకా తిరుమలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. 

అప్పటి నుంచి తణుకులోని పాలంగి రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల షన్వీర్ అనే బాలుడు కూడా ఉన్నాడు. అయితే శివకుమార్ కు పెళ్లికి ముందే రాజమండ్రికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె తండ్రి ఏఎస్సై. శివకుమార్ వివాహేతర సంబంధానికి మహిళ తండ్రి, సోదరుడు సహకరిస్తున్నాడు. 

తన భర్త వివాహేతర విషయం బయటపడటంతో అనంతలక్ష్మీ శివకుమార్ ను నిలదీసింది. తనకు అన్యాయం చేయోద్దంటూ బ్రతిమలాడుకుంది. ఇదే విషయంపై శివకుమార్ అనంతలక్ష్మీల మధ్య గొడవలు జరుగుతుండేవి. 

అయితే ఈ మధ్య కాలంలో శివకుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె సోదరుడు అనంతలక్ష్మీని వేధింపులకు గురిచేస్తున్నారు. వివాహేతర సంబంధాన్ని దాచి పెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నా భరించింది. కుటుంబాన్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవడంతో ఏం చెయ్యలేక అన్నీ భరిస్తూనే వచ్చింది. అయితే పరాయి మనుషులు బెదిరిస్తుండటంతో తట్టుకోలేకపోయింది. 

ఇలా ఉంటే నాలుగు రోజుల క్రితం తిరుపతి వెళ్తున్నానని శివకుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే శివకుమార్ ప్రియురాలితో టూర్ కువెళ్లాడని తెలియడంతో అతనికి అనంత లక్ష్మీ ఫోన్ చేసింది. ఫోన్ లో ఇద్దరి మధ్య ఘర్షన చోటు చేసుకుంది. 

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అనంతలక్ష్మీ తన ఇంటి సమీపంలో మరో అపార్ట్ మెంట్ లో ఉంటున్న శివకుమార్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కుమారుడు షన్వీర్ ను అక్కడ వదిలిపెట్టి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. 

సాయంత్రం అయినా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ తియ్యకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి అర్థరాత్రి 12 గంటలకు తలుపులు పగలగొట్టి చూడగా బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. తన అల్లుడు శివకుమార్, అతని ప్రియురాలు, తల్లిదండ్రులే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమంటూ అనంతలక్ష్మీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి దగ్గర సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. నా భర్త వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య సహకరిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితాన్ని వీళ్లంతా సర్వనాశనం చేశారు. నాకు వేరే దిక్కు లేదు. 

మూడేళ్ల వయసున్న నా కొడుకును ఒంటరిగా వదిలి చనిపోతున్నాను. నా భర్తకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి ఇకపై ఎవరి కాపురాల్ని కూల్చకుండా ఉంటుంది. రెండేళ్లలో ఆమె పరిస్థితి కూడా నాలాగే తయారవుతుంది అని సూసైడ్ నోట్ రాసి తనువు చాలిచింది అనంతలక్ష్మీ.  

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

భర్తను కాదని వేరే వ్యక్తితో సంబంధం.. చివరకిలా..