అనుమానం పెనుభూతమై... భార్యను గొడ్డలితో నరికిచంపిన సైకో భర్త
భార్యను అనుమానం రోజురోజుకూ మరింత పెరిగి పెనుభూతం అయ్యింది. దీంతో సైకోలా మారిన భర్త కట్టుకున్న భార్యను అత్యంత కర్కశంగా కడతేర్చిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

నందిగామ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్యను కట్టుకున్నవాడే కడతేర్చాడు. తన కాళ్లపై తాను నిలబడి నాలుగు రాళ్లు సంపాదించడమే ఆమె చేసిన తప్పయ్యింది. సొంతంగా ఉపాధి పొందుతున్న భార్యపై ఆ సైకో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రేమానురాగాలు మరిచి విచక్షణ కోల్పోయిన అతడు భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ అమానుషం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన మేడి వెంకటేశ్వరరావు, నళిని భార్యాభర్తలు. స్వగ్రామంలోనే భార్య టైలరింగ్ షాప్ నిర్వహిస్తూ స్వయంఉపాధి పొందుతోంది. భర్త విశాఖ రేకుల పరిశ్రమలో పనిచేస్తుండేవాడు. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తుండటంతో ఏ చింతా లేకుండా సంసారం హాయిగా సాగిపోతుండేది.
అయితే టైలరింగ్ షాప్ నిర్వహనలో భాగంగా నళిని అందరితో సరదాగా మాట్లాడుతుండేది. ఇదే భర్త వెంకటేశ్వరరావుకు భార్యపై అనుమానాన్ని పెంచింది. అతడి అనుమానం రోజురోజుల మరింత పెరిగి చివరకు భార్యను అంతమొందించే స్థాయికి చేరింది. భార్య నళినితో గొడవపడ్డ వెంకటేశ్వరరావు ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో విచక్షణ కోల్పోయిన అతడు గొడ్డలి తీసుకుని ఆమెను అతి దారుణంగా నరికాడు. తీవ్ర గాయాలతో అక్కడే రక్తపుమడుగులో కుప్పకూలిన నళిని ప్రాణాలు కోల్పోయింది.
Read More సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన.. గురుకుల హాస్టల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..
నళిని చావుకేకలు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చిచూడగా అప్పటికే ఆమె చనిపోయింది. రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకుని వెంకటేశ్వరావు అక్కడే వున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న వారు నిందితుడిని అరెస్ట్ చేసారు. అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. నళిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.