విజయవాడ: విదేశాల నుంచి వచ్చినవారితో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వారు క్వారంటైన్ వెళ్లకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం సంకటంగా మారింది. ప్రభుత్వ వాహనాల్లో లేదా ప్రైవేట్ వాహనాల్లో వారు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వారి వల్ల తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉంది. ప్యారిస్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి హైదరాబాదు నుంచి విజయవాడకు ఓ క్యాబ్ లో చేరుకున్నాడు. ప్యారిస్ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. గుంటూరుకు చెందిన ఆ క్యాబ్ లో ముగ్గురు హైదరాబాదుకు వెళ్లారు.

దాంతో క్యాబ్ లో హైదరాబాదుకు వెళ్లిన ముగ్గురిని కనిపెట్టడానికి విజయవాడ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్యారిస్ నుంచి వచ్చిన విద్యార్థి మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదు వచ్చాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడ వచ్చాడు. 

వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తిండికి, ఇతర అవసరాల కోసం సంచరించాడు. అతనితో కాంటాక్టులోకి వచ్చినవారిని గుర్తించడం కష్టంగా మారింది. దాంతో వైద్య, ఆరోగ్య, నగరపాలక సంస్థల అధికారులు దాదాపు 500 ఇళ్లను తనిఖీ చేశారు. బాధితుడి నివాసానికి సమీపంలో ఉన్నవారందరినీ పరిశీలించారు. 

ప్రైవేట్ క్యాబ్ లో ఆ విద్యార్థి విజయవాడకు చేరుకున్నాడని, డ్రైవర్ ముగ్గురు గుంటూరు నుంచి హైదరాబాదులోని కూకట్ పల్లికి తీసుకుని వెళ్లాడని అధికారులు చెబుతున్నారు. ఆ ముగ్గురు ఎక్కడున్నారనే విషయాన్ని కనిపెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ప్యారిస్ నుంచి వచ్చిన విద్యార్థికి మార్చి 20వ తేదీన జ్వరం పట్టుకుంది. దాంతో అతన్ని ఐసోలేషన్ వార్డులోకి తరలించారు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ అధికారులకు తెలియజేస్తూ క్యాబ్ లో ముగ్గురు హైదరాబాదుకు చేరుకున్న విషయాన్ని చెప్పారు.