ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేపడుతున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైతులు చేపడుతున్న ఆందోళనలు శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. 

తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రతి గ్రామ కూడలిలో ముళ్లకంచెలు సిద్ధం చేశారు. సచివాలయం చుట్టుపక్కల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మందడం, మాల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తుపాకులు, లాఠీలతో బస్సుల్లో పెద్ద ఎత్తున  పోలీసు బలగాలు దిగాయి. ఏపీ సచివాలయాలనికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక దళాలు మోహరించాయి. గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాజధాని రైతులు పేర్కొంటున్నారు.

సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పదోరోజూ రహదారిపై మహాధర్నా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.