నందిగామలో భారీ అగ్ని ప్రమాదం... కాలిబూడిదైన పర్నీచర్ షాప్ (వీడియో)
పర్నీచర్ షాప్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని భారీగా ఆస్తినష్టం జరిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పర్నిచర్ తయారీ షాప్ లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పర్నీచర్ తయారీ కోసం ఉపయోగించే వుడ్, ప్లైవుడ్ తో కొంత పర్నీచర్, యంత్రాలు ఈ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగకున్నా భారీగా ఆస్తినష్టం జరిగింది.
అగ్నిప్రమాదం జరిగిన షాప్ యజమాని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిగామ పాత బస్టాండ్ సమీపంలో శ్రీ బాలాజి డోర్స్ ఆండ్ వుడ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా ఈ షాప్ పనిచేసిన సిబ్బంది బుధవారం తెల్లవారుజామున వెళ్లిపోయారు. షాప్ యజమాని మెండే ప్రసాద్ కూడా తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు.
అయితే యజమాని వెళ్ళిపోయిన కొద్దిసేపటికే షాప్ లోంచి చిన్నగా పొగలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటం గమనించిన స్థానికులు యజమాని ప్రసాద్ తో పాటు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి నందిగామ, కంచికచర్ల నుండి రెండు ఫైరింజన్లు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేసారు.
వీడియో
అయితే మంటల్లో పర్నిచర్ తో పాటు వాటి తయారీకి ఉపయోగించే మిషనరీ కాలిపోయిందని షాప్ యజమాని ప్రసాద్ తెలిపారు. దాదాపు 80 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేసాడు. విద్యుత్ షాట్ సర్య్కూట్ వల్లే మంటలు ప్రారంభమై వుంటాయని... అవికాస్తా వుడ్, ప్లైవుడ్ కు వెంటనే అంటుకుని షాప్ మొత్తం కాలిపోయినట్లు భావిస్తున్నారు.