‘తల్లికి వందనం’ ఎంతమందికి ఇస్తారో చెప్పాలి: గుడివాడ అమర్నాథ్
‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు. నెల రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చాలా ఆందోళన కలిగిస్తోంది.’’
విశాఖపట్నం: ఏమీ చేయకుండానే అన్నీ తానే చేసినట్లు చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరెవరు సాటి రారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎవరికీ ఉండవని ఎద్దేవా చేశారు. నాలుగుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా.. ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులన్నీ వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే.. ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్నీ చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టించారా? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేం చేస్తే ఇప్పుడేమో వైఎస్ జగన్ ఏమీ చెయ్యలేదని చంద్రబాబు చిత్రీకరించారు. మేం మొదలుపెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లికి వందనం రూ.15వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఒకరికే ఇస్తామన్నట్లు జీఓ ఇచ్చారు. ఇసుక ఫ్రీ అన్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు. వాలంటీర్లు పరిస్థితి ఏంటో చెప్పాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు.. గడిచిన నెల రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కూడా దాడుకు దిగడం చాలా దారుణ’’మంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
‘‘భోగాపురం ఎయిర్ పోర్ట్కు సంబంధించిన భూసేకరణ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది. ఏమీ చేయకపోయన అన్ని నేనే చేశానని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం ఎయిర్ పోర్టు భూములకు సంబంధించిన కేసులను పరిష్కరించాం. రెండు గ్రామాలకు 80కోట్ల రూపాయల పరిహారం ఇచ్చాం. కేంద్ర సంస్థల నుంచి నో- అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాం. మేం చేసిన కార్యక్రమాలను వారే చేసినట్లు చెప్పుకుంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్నీ పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేనాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లాం’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూలపేట పోర్ట్ పనులు దాదాపు 45శాతం పూర్తయ్యాయని వివరించారు.
‘‘బీపీసీఎల్ ప్రతినిధులు వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశీలనకు వచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక బీపీసీఎల్ వచ్చినట్లు చెబుతున్నారు. మార్కెటింగ్ చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలో అప్పు తక్కువని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని’’ మాజీ మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రభుత్వ బెదిరింపులకు తమ కార్యకర్తలు కూడా భయపడరన్న అమర్నాథ్.. ప్రజలకు మంచి చేయాలనే కోరిక ఉండాలేకానీ ఇలా ఇబ్బంది పెట్టొద్దని కోరారు.