ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నూత‌నంగా నిర్మించనున్న కొత్త ఇంటికి భూమి పూజ నిర్వ‌హించారు. అంత వరకూ సంతోషించాల్సిన విషయమే. అయితే, ఇక్కడే నెటిజన్లు పవన్ పై అనుమానాలు మొదలయ్యాయి.   

ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే, ఈ మధ్యనే మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ, ‘ ఇఎంఐలు కట్టే స్తోమత లేకే తన కారును కూడా అమ్మేసుకున్నట్లు చెప్పారు. అప్పట్లో స్వయంగా తన ఆర్ధిక పరిస్ధితిని పవన్ వివరించినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. సరే, వరుసబెట్టి సినిమాలు ఫ్లాపులవుతున్నాయి కదా డబ్బులకు ఇబ్బందులు పడుతున్నారేమో అని అనుకున్నారు. అంతే కానీ ఇఎంఐలు కట్టలేని దయనీయ స్ధితిలో ఉన్నారని ఎవరూ అనుకోలేదు.

సీన్ కట్ చేస్తే, సోమ‌వారం ఉద‌యం గం 8.26 నిమిషాల‌కు  ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తులు ప్ర‌ధాన గృహానికి సంప్ర‌దాయ బ‌ద్దంగా శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి పునాదిరాయి వేశారు. తర్వాత 9.45 నిమిషాల‌కి కార్యాల‌యానికి కూడా భూమి పూజ నిర్వ‌హించారు.  ఖాజా టోల్ గేట్‌కి స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి 5కి ద‌గ్గ‌ర్లో ప‌వ‌న్‌ ఇటీవ‌ల కొనుగోలు చేసిన రెండెక‌రాల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించబోతున్నారు.  

ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అదేంటంటే, ఇఎంఐ కట్టలేక కారును అమ్మేసుకున్న పవన్ కు రెండెకరాల స్ధలంలో సువిశాలమైన భవనం, కార్యాలయం నిర్మించేందుకు డబ్బులు ఎక్కడివి? అమరావతి ప్రాంతంలో రెండెకరాలు కొనాలంటే మామూలు విషయం కాదు. కచ్చితంగా కోట్ల రూపాయలు ఉండాల్సిందే. అంతేకాకుండా సువిశాల స్ధలంలో భవనంతో పాటు కార్యాలయం కూడా నిర్మిస్తున్నారు. అంటే రెండింటికి కూడా మరికొన్ని కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఓ అంచనా ప్రకారం స్ధలం కొనుగోలు, భవనాల నిర్మాణానికి సుమారు రూ. 40 కోట్లు అవుతోందట.

కారు ఇఎంఐనే చెల్లించలేని వ్యక్తికి ఏకంగా రూ. 40 కోట్లు ఎలా వచ్చాయి? ఈ విషయం మీదనే నెటిజన్లు పవన్ పై తమ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు.