ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రభుత్వాసుపత్రినుంచి ఇంటికి వెళ్లేందుకు వారిచ్చే వాహనం వద్దన్నందుకు ఓ బాలింత భర్తమీద దాడి జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో ఆ వ్యక్తి కంటికి గాయమయ్యింది. ముక్కులో నుంచి రక్తం కారింది.
విశాఖపట్నం : ‘Thalli Bidda Express’ వాహనం తమకు వద్దని.. సొంత వాహనంలో వెళ్ళిపోతామని చెప్పినందుకు ఆసుపత్రి సిబ్బంది ఒకరు బాలింత భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన Visakha KGH ప్రసూతి విభాగం వెలుపల జరిగింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం penugollu ధర్మవరం గ్రామానికి చెందిన సారిపిల్లి మనోజ్ తన భార్య ఝాన్సీని ప్రసవం కోసం ఈనెల 19న కేజీహెచ్లో చేర్చాడు. ఆ సమయంలో మనోజ్ వద్దకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం డ్రైవర్ ఒకరు వచ్చి వారి స్వగ్రామానికి వాహనంలో తీసుకువెళతానని చెప్పాడు. అయితే తమకు సొంత వాహనం ఉందని, అందులో వెడతామని మనోజ్ చెప్పాడు. దీనికి అంగీకరించిన వాహన డ్రైవర్ అవసరమైన పత్రాలను వారికి ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత భార్య బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లడానికి.. మనోజ్ వారి వాహనం వద్దకు వెళ్తుండగా మరో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ వచ్చి మనోజ్ తో వాగ్వాదానికి దిగాడు. తాము ఉన్నది బాలింతలను తరలించడానికి అని సొంత వాహనంలో వెళ్ళకూడదని అడ్డుపడ్డాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఘర్షణ మొదలైంది. ఇంతలో అక్కడే భద్రతా విధులు నిర్వహిస్తున్న కుమార్ దూసుకువచ్చి మనోజ్ కంటిపై బలంగా కొట్టడంతో ముక్కు వెంట రక్తం కారింది. ఇది జరుగుతున్న సమయంలోనే తన తల్లిదండ్రులతో కూడా భద్రతా సిబ్బంది వాగ్వాదానికి దిగారు అని ఆయన వాపోయారు. ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యాధికారులకు ఫిర్యాదు చేసి వెళ్లిపోయామని ఆయన తెలిపారు.
విచారణ చేపడతాం…
ప్రసూతి విభాగం వద్ద చోటు చేసుకున్న ఘటనపై విచారణ చేపడతామని ఆస్పత్రి పర్యవేక్షణ వైద్యాధికారి డాక్టర్ పి మైథిలి తెలిపారు. భద్రత విభాగ ఉద్యోగిదాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారని, దీని ఆధారంగా విచారణ చేయాలని ప్రసూతి విభాగ అధిపతి నాగమణిని ఆదేశించామని అన్నారు. భద్రతా ఉద్యోగికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.
బిడ్డకో రేటు వసూలు.. బాధితుడు మనోజ్
తన భార్య ప్రసవం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పెట్టారని మనోజ్ వాపోయాడు. మగబిడ్డ పుడితే రూ.5000, ఆడబిడ్డ పుడితే మూడు వేలచొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇస్తే తప్ప వైద్యసేవలు అందడం లేదని వాపోయారు. ఆస్పత్రిలో దొంగల బెడద కూడా ఉందని తన సెల్ఫోన్, పర్సు చోరీ చేశారని.. అందులో నాలుగు వేల నగదు ఉందన్నారు. తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుని ఆస్పత్రి నుంచి బయటపడ్డామని వివరించారు. మంగళవారం తాము ఒకరితో వాగ్వాదానికి దిగితే మరొకరు వచ్చి దాడి చేసి గాయపరిచారని, ఇదంతా మామూళ్ల కోసం జరుగుతున్న తంతేనని ఆరోపించారు
