konaseema violance : మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళపై దాడిచేసినవారు అరెస్ట్: హోంమంత్రి వనిత
కోనసీమ జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో జరిగిన అల్లర్లపై హోంమంత్రి తానేటి వనిత రాష్ట్ర డిజిపితో చర్చించారు. అనంతరం ఈ హింసాత్మక ఘటనపై హోమంత్రి స్పందించారు.
విజయవాడ: మంగళవారం కోనసీమ జిల్లా పేరుమార్పును నిరసిస్తూ జరగిన విధ్వంసంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారని... అందువల్లే ఇంత ఉద్రిక్తత పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సామాన్య ప్రజలతో పాటు ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు హోమంత్రి పేర్కొన్నారు.
అమలాపురంలో మంగళవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రస్తుత పరిస్థితులపై హోంమంత్రి డిజిపితో చర్చించారు. ఈ సందర్భంగా అమలాపురంలో జరిగిన సంఘటనలపై హోమంత్రి పూర్తి వివరాలు పోలీస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హోమంత్రి అనిత మాట్లాడుతూ... అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారన్నారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లతో పాటు అదనపు బలగాలను పంపించామన్నారు. ఇప్పటికయితే ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.... అందరూ ధైర్యంగా ఉండొచ్చని హోమంత్రి భరోసా ఇచ్చారు.
Video
''మంగళవారం అమలాపురంలో హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో 7కు పైగా పోలీస్ కేసులుండి నిన్నటి హింసాత్మక ఘటనలో పాల్గొన్న72 మందిని ఇప్పటికే గుర్తించగా వీరిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. శాసన సభ్యులు, మంత్రి ఇంటిపైనే కాదు జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అన్నారు.
''తాము గాయపడినప్పటికి ప్రజలకు రక్షణగా ఉంటూ పోలీసులు సంయమనం పాటించి ఆందోళనకారులను అదుపుచేశారు. నిన్న పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనం. ఇలా ధైర్యంగా హింసాత్మక ఘటనలను అదుపుచేసిన పోలీసులను అభినందిస్తున్నాను'' అన్నారు హోంమంత్రి అనిత.
''అమలాపురం విధ్వంసం తర్వాత సోషల్ మీడియా ద్వారా రూమర్స్ వ్యాప్తిచెందకుండా ఇంటర్నెట్ నిలిపివేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా వున్నారు. ప్రజలెవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని హోంమంత్రి భరోసా ఇచ్చారు.
ఇక ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కోనసీమలో తాజా పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... కొనసీమకు అదనపు బలగాలను తరలించడం జరిగిందన్నారు. 2000 మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చెప్పారు. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు.
ప్రస్తుతం కొనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ చెప్పారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. నిన్న హింసాత్మక ఘటనలకు పాల్పడిన 72 మందిని గుర్తించామని చెప్పారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నగరంలోని రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. పోలీసులు సంయమనం పాటించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారని తెలిపారు.
అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సాప్ గ్రూప్‌లలో తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయన్నారు. 3 బస్సుల దహనంపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.