హోంగార్డులకు వేతనం పెంచిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న హోంగార్డులకు శుభవార్త.. ఎన్నో రోజులుగా తమ దినసరి వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న హోంగార్డుల ఆశ నెరవేరింది.. వారి దినసరి వేతనాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్లో సీఎంను హోంగార్డు ప్రతినిధులు కలిసి తమ సమస్యలను తెలిపారు..
వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వారి దినసరి వేతనాన్ని రూ.300 నుంచి రూ.600కు పెంచుతున్నట్లు.. అలాగే మహిళా హోంగార్డులకు మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీనితో పాటుగా హోంగార్డు మరణిస్తే.. దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేలు మంజూరు చేస్తామని.. ఆరోగ్య అవసరాల నిమిత్తం.. ఎన్టీఆర్ వైద్య సేవలో రెండున్నర లక్షల రూపాయల మేర వైద్య సాయంతో పాటు గృహ నిర్మాణ పథకం గురించి ఆయా శాఖల అధికారులతో చర్చిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డులు హర్షం వ్యక్తం చేశారు.
