హైదరాబాద్: హితేష్ చెంచురామ్ అమెరికా పౌరసత్వం ఈ నెల 11వ తేదీన రద్దైంది. ఎన్నికలకు ముందు చెంచురామ్ పౌరసత్వం రద్దైతే ఈ ఎన్నికల్లో ఆయన పర్చూరు నుండి పోటీ చేసేవారు. ఆయన పౌరసత్వం రద్దు కానందున దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నుండి  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.

హితేష్ చెంచురామ్‌ను వైసీపీ అభ్యర్ధిగా పర్చూరు నుండి బరిలోకి దింపాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్లాన్ చేశారు. ఈ విషయమై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో ఆయన రెండు మాసాల క్రితం చర్చించారు.  అయితే నామినేషన్ల ప్రక్రియ సమయానికి చెంచురామ్ అమెరికా పౌరసత్వం రద్దు కాలేదు.

దీంతో పర్చూరు నుండి  దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్ధిగా పోటీకి దిగారు. పోలింగ్ రోజునే హితేష్ చెంచురామ్ అమెరికా పౌరసత్వం రద్దైనట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి  సమాచారం అందింది.

ఈ దఫా  తాను పర్చూరు నుండి పోటీ చేసి విజయం సాధిస్తే.... రెండేళ్ల తర్వాత తాను రాజీనామా చేసి... ఉప ఎన్నికల్లో  తన కొడుకు హితేష్‌ను ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ వద్ద ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదు. ఈ ఐదేళ్ల పాటు తనతో ఉండాలని జగన్ దగ్గుబాటికి సూచించాడు.

వచ్చే టర్మ్‌లో హితేష్ చెంచురామ్‌ను తనతో తీసుకెళ్లనున్నట్టుగా  జగన్ హామీ ఇచ్చారని సమాచారం. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో  పోటీ చేయడానికి హితేష్ చెంచురామ్ మరో ఐదేళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.